గ్రానైట్ వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తే చర్యలు
మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలను రోడ్లకు ఇరువైపులా వేయకూడదని, దీనివల్ల ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఫ్యాక్టరీల యజమానులు దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకోవాలని మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ అన్నారు. కట్టమంచి బాలకష్ణారెడ్డి మ్యాంగో భవన్‌లో మంగళవారం ఉదయం మైనింగ్, పొల్యూషన్ అధికారులు గ్రానైట్‌ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మైనింగ్‌శాఖ డీడీ మాట్లాడుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ నిర్వహించిన సమావేశంలో గ్రానైట్ వ్యర్థాలు రోడ్ల వైపు వేయడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగిందని ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు అందరూ ఫ్యాక్టరీ యజమానులు సహకరించాలని అన్నారు. జాతీయ రహదారుల వైపు కూడా ఈవ్యర్థాలను వేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక స్థలం ప్రత్యేకించి డంపింగ్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుందని రెవెన్యూ అధికారులతో కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఉన్నామని తెలిపిన మైనింగ్ అధికారులు అంతవరకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలలో డంపింగ్ చేసుకోవాలని రోడ్ల వైపు వేయకూడదని అన్నారు. జాతీయ రహదారులు వెళ్లే సమయంలో వాహనాలు వేగంగా వెళ్లడం జరుగుతుంటుందని అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ గ్రానైట్ వ్యర్థాలు తగిలి మరింత మంది గాయపడటం కానీ లేదా మరణించడం కానీ జరుగుతోందని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆ మేరకు ఫ్యాక్టరీ యజమానులు కూడా సహకరించి తగు నిర్ణయం తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్, ఏడీలు వేణుగోపాల్ ప్రకాష్ కుమార్, నరేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నరేంద్రబాబు, మైనింగ్ శాఖ డిడి ప్రసాద్, మైనింగ్ శాఖ ఏడీలు ప్రకాష్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.










