
* శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస: నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తొగరాంలో ఎస్‌ఆర్‌పి నిధులు రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో రాగోలు కూడలి నుంచి తొగరాం వరకు పది కిలోమీటర్ల మేర నిర్మించనున్న నూతన రహదారి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజా రవాణా అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రహదారుల అభివృద్ధికి కృషి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ నేడు దేశానికే తలమానికంగా మారిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తన స్థానాన్ని ప్రజల గుండెల్లో పదిలపరుచుకుని హుందాగా పరిపాలన సాగిస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో తొగరాం సర్పంచ్ తమ్మినేని వాణిశ్రీ, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, రోడ్లు భవనాలశాఖ ఎస్‌ఇ జామి సుధాకర్, ఇఇ రవినాయక్, డిఇ జనార్థనరావు, సర్పంచ్‌లు, ఎన్ని రామచంద్ర రావు, చిలకలపల్లి సురేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.