డిసెంబర్ చివరికి విద్యుత్ కనెక్షన్లు
రోడ్లు యుద్దప్రాతిపదికన మరమ్మతులు
'స్టాండింగ్' కమిటీ సమీక్షలో జెడ్పి ఛైర్మెన్
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
జిల్లాలో సచివాలయాల భవన నిర్మాణాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగవంతం చేసి నీటిని ప్రజలకు అందించాలని, డిసెంబర్ 31 లోపల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసి సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, స్టాండింగ్ కమిటీ ఒకటి, ఏడు కమిటీల చైర్మన్ అయిన గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ఒకటి మరియు ఏడు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ అధికారులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు 524 గ్రామ సచివాలయాలు, 506 రైతు భరోసా కేంద్రాలు,351 వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, 153 పాలసీకళీకరణ కేంద్రాలు, 142 వైఎస్‌ఆర్ డిజిటల్ లైబ్రరీలు, 33 ప్రధానమంత్రి యోజన కార్యక్రమాలు, 472 రూరల్ రోడ్డు కనెక్టివిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా శాంతిపురం, రామసముద్రం, ఏర్పేడు మండలాలలో అనుమతులు కావాలనీ పనులను వేగవంతం చేయాలనీ కోరారు. డిసెంబర్ 31 నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడం జరుగుతుందనీ 45 గ్రామాలకు సంబంధించి కేంద్రం అనుమతి కావాల్సి ఉందని ఎంపీలు సాధించేందుకు కషి చేస్తున్నారనీ తెలిపారు. రోడ్లు భవనాల శాఖ ద్వారా చిత్తూరు జిల్లా 74 పనులు మంజూరు అయ్యాయని, ఇందులో 59 పనులు పూర్తి అయ్యాయని, మరో పన్నెండు పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బైరెడ్డిపల్లి జెడ్పిటిసి కేశవులు మాట్లాడుతూ విరుపాక్షిపురానికి వెళ్లే నూతన రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ సి ఈ ఓ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు.
డిఆర్‌డిఎ ఆర్థిక సాయం
శనివారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ఆరవ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ 2, జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఆరవ సంఘం చైర్మన్ రమ్య మాట్లాడుతూ విదేశీ విద్యాదీవెన కోసం ప్రభుత్వం అందజేయనున్న ప్రోత్సాహంతో పాటు దివ్యాంగుల కోసం మోటార్ వాహనాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో నాటు సారా కేసులకు సంబంధించి 105 మంది ఉన్నారని, వారికి ఎస్సీ కార్పొరేషన్, డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రభాకర్ రెడ్డి, ఐసిడిఎస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి, జడ్పిటిసి సభ్యులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు, మహిళల ఆరోగ్యం పట్లఅత్యంత శ్రద్ధ తీసుకుంటుందని స్థాయి సంఘ సమావేశాల్లో ఐదో సంఘం అయిన మహిళ సంక్షేమ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఐసిడిఎస్ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భారతి మాట్లాడుతూ మహిళల్లో అనిమియా వంటి వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక ఆహారంతో పాటు వైద్యం కల్పించబడుతుందన్నారు.










