Apr 24,2023 21:00

జిల్లాలో గ్రామ పంచాయతీలకు పురస్కారాలు
ప్రజాశక్తి - పాలకోడేరు
ప్రతి గ్రామమూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు) అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం పంచాయతీ రాజ్‌ దినోత్సవం ఎంపిపి చంటిరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన తొమ్మిది అంశాల సర్వేలో మండలంలో 14 గ్రామాలకు గాను 11 గ్రామాలకు 27 అవార్డులు లభించాయి. దీనిలో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి విస్సాకోడేరు గ్రామ పంచాయతీకి జిల్లాస్థాయిలో ప్రథమ అవార్డు లభించింది. అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపిపి చంటిరాజు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్తు అభివృద్ధి అధికారి మురళీగంగాధర్‌, మండల విస్తరణ అధికారి రెడ్డియ్య, ఎంపిపి చంటిరాజు మాట్లాడారు. అనంతరం ఎంపిపి చంటిరాజును అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ఎంపిపిలు నరేష్‌, ఆదాడ లక్ష్మీ తులసి, సర్పంచులు జంగం సూరిబాబు, కడలి నాగేశ్వరి, మరియమ్మ, చిత్తపల్లి వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
మొగల్తూరు : ప్రజా సమస్యలు తీర్చిన ప్రజా ప్రతినిధులకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపిపి కైలా సుబ్బారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 విభాగాల్లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన 8 పంచాయతీలకు అవార్డులు అందించారు. మొగల్తూరు 2, మోడీ 2, ముత్యాలపల్లి నాలుగు, రామన్నపాలెం 3 ,కాళీపట్నం తూర్పు 6, కొత్తట 1, శేరేపాలెం నాలుగు, పేరుపాలెం సౌత్‌ 5 పంచాయతీలు అవార్డులు గెలుచుకున్నాయన్నారు. ఆయా గ్రామాల సర్పంచులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ఎంపిడిఒ ఆర్‌సి ఆనంద్‌ కుమార్‌, జెడ్‌పిటిసి తిరుమల బాపూజీ, వైస్‌ ఎంపిపి సుబ్బారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి నవీన్‌ కిరణ్‌, ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ కటికల సూర్యారావు పాల్గొన్నారు.
ఆచంట:గ్రామాల్లో అందుబాటులోని వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి అన్నారు. మండలంలో ప్రపంచ పంచాయతీ రాజ్‌ దినోత్సవంలో భాగంగా ఎంపిడిఒ కార్యాలయంలో సర్పంచులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మండలంలో 9 థీమ్స్‌లో ఒక్కో థీమ్స్‌ నందు మూడు గ్రామ పంచాయతీల చొప్పున 27 అవార్డులు వచ్చినట్లు ఎంపిడిఒ విఎస్‌విఎల్‌ జగన్నాథరావు తెలిపారు. మండలంలో కరుగోరుమిల్లి, పెదమల్లం, శేషమ్మచెరువు, వల్లూరు, పెనుమంచిలి, భీమలాపురం కందరవల్లి, ఆచంట వేమవరం, కోడేరు, ఆచంట, అయోధ్య లంక, కోడేరు, పంచాయతీల్లో ఎన్నికైన గ్రామ సర్పంచులు, కార్యదర్శులను ఎంపిపి, జెడ్‌పిటిసి పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నేలపూడి బేబీ రామ్మోహన్‌రావు, గుబ్బల మాధవరావు, అల్లం పద్మావతి, కార్యదర్శులు, జివివి సత్యనారాయణ పాల్గొన్నారు.
జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా కొడమంచిలి పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను సత్కరించినట్లు సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షేక్‌ హినా భాను, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పెనుమంట్ర:గ్రామ పంచాయతీలకు అవార్డుతోపాటు ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని జుత్తిగ సర్పంచి, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ రాజు దినోత్సవం సందర్భంగా ఆయా శాఖల పనితీరు పట్ల వివిధ స్థాయిలో పంచాయతీ సర్పంచులను సత్కరించారు. ఈ సందర్భంలో పెనుమంట్ర సర్పంచి తాడిపర్తి ప్రియాంక మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల కృషితో ప్రజలకు మరిన్ని సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెండో వైస్‌ ఎంపిపి ఈది అనిత, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జి, ఇఒపిఆర్‌డి రాంప్రసాద్‌, సర్పంచులు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా నెలమూరు గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయిలో రెండో స్థానం వచ్చిన నేపథ్యంలో బాలల స్నేహపూర్వక గ్రామం పేరున అవార్డును కలెక్టర్‌ ప్రశాంతి చేతుల మీదుగా నెలమూరు సర్పంచి కుచ్చర్లపాటి మంగతాయారు అందుకున్నారు. భీమవరం కలెక్టరేట్‌లో అవార్డు అందజేశారు.
అత్తిలి:గ్రామ పంచాయతీలకు దశలవారీగా జిల్లా, మండల స్థాయి థీమ్‌ వారీగా అవార్డులు రావడం అభినందనీయమని ఎంపిపి మక్కా సూర్యనారాయణ అన్నారు. ఎంపిడిఒ కార్యాలj ుంలో జిల్లా, మండల స్థాయి థీమ్‌ వారీగా వార్డు పొందిన సర్పంచులకు ఎంపిడిఒ వివివి ఎస్‌.రామారావు ఆధ్వర్యంలో సర్పంచులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయిలోని థీమ్‌ 3 పిల్లల స్నేహ పూర్వక గ్రామ పంచాయతీగా ఉరదాళ్లపాలెం, థీమ్‌ 5కు పారిశుధ్యం, హరిత గ్రామ పంచాయతీగా దంతుపల్లి, థీమ్‌ 7గా సామాజిక భద్రత కలిగిన గ్రామ పంచాయతీగా మంచిలి, థీమ్‌ 8గా సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీగా దంతుపల్లికి అవార్డులు వచ్చాయని చెప్పారు. అలాగే మండల స్థాయిలో థీమ్‌1లో మెరుగైన జీవనోపాధి గల గ్రామ పంచాయతీలుగా ఉరదాళ్లపాలెం, గుమ్మంపాడు, పాలి, థీమ్‌ 2లో ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా పాలి, ఉరదాళ్లపాలెం, మంచిలి, థీమ్‌ 3లో పిల్లల స్నేహపూర్వక గ్రామ పంచాయతీలో ఉరదాళ్లపాలెం, దంతుపల్లి, పాలూరు, థీమ్‌4లో నీటి సమృద్ధి కలిగిన గ్రామ పంచాయతీగా పాలి, మంచిలి, ఆరవల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ బుద్దరాజు భరణీప్రసాద్‌, జెడ్‌పిటిసి అడ్డాల జానకి, కో ఆప్షన్‌ సభ్యులు అబీరుద్దీన్‌, సర్పంచులు పాల్గొన్నారు.
ఉండి:మండల స్థాయిలో యండగండి గ్రామానికి అవార్డుల పంట పండింది. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి అడబాల వెంకట అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవం కార్యక్రమంలో మండల స్థాయిలో 9 రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామ పంచాయతీలకు ప్రశంసా పత్రాలను మండల పరిషత్‌ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో 9 రంగాలకు గాను ఐదు రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యండగండి గ్రామ పంచాయతీ సర్పంచి గోగులమండ చిన్న కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి కెఎస్‌ఎస్‌ రామలక్ష్మిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా యండగండి సర్పంచి చిన్న కృష్ణమూర్తి మాట్లాడారు. మండలంలోని కోలమూరు, వాండ్రం, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, ఉనుదుర్రు రెండేసి రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గ్రామాలుగా నిలిచాయి.
కాళ్ల : గ్రామ పంచాయతీల అభివృద్ధితోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యపడుతుందని ఎంపిపి పెన్మత్స శిరీష విశ్వనాథరాజు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. మండలంలో 12 ఉత్తమ పంచాయతీలను ఎన్నుకున్నారు. 12 పంచాయతీల్లో సీసలి పంచాయతీ ప్రథమస్థానంలో ఉంది. సీసలి ఏడు అంశాల్లో, కాళ్ల నాలుగు, కోపల్లె మూడు, ప్రాతళ్లమెరక, దొడ్డనపూడి, వేంపాడు, బొండాడ పంచాయతీలు రెండు అంశాల్లో, జువ్వలపాలెం, ఎస్‌సి బోస్‌ మాజీ సైనిక్‌ కాలనీ, కాళ్లకూరు, బొండాడ పేట, పెదఅమిరం ఒక్కో ఒక్క అంశాల్లో ప్రగతి సాధించి అవార్డులు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతే తద్వారా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేసిన పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ జి.స్వాతి, ఇఒపిఆర్‌డి ఎంవి.భాస్కరరావు, ఎఒ ఎంఎస్‌ ప్రభాకర్‌, సర్పంచులు పాల్గొన్నారు.