డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు
ప్రజాశక్తి - ఉండి
గ్రామాలాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. బుధవారం పెదపుల్లేరు గ్రామంలో సుమారు రూ.11 లక్షలతో మండల పరిషత్ నిధులతో పాతకాలనీకి వెళ్లేందుకు నిర్మించిన గ్రావెల్ రోడ్డును పివిఎల్ నరసింహరాజు, మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అవసరమైన చోట రహదారులు వేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం రబీ సీజన్లో సుమారు 55 బస్తాల ధాన్యం కొనుగోలు చేస్తారని అనుకుంటే ఇప్పుడు కూడా 40 నుంచి 45 బస్తాలు మాత్రమే తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని రైతులు పివిఎల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన నరసింహరాజు మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి రాయి రావులమ్మ, గ్రామ అధ్యక్షుడు పప్పల రాంప్రసాద్, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు పాల్గొన్నారు.










