ప్రజాశక్తి-వి కోట : అధికార పార్టీ ప్రధానప్రతిపక్ష పార్టీల నేతలు మండలంలో ఒకే రోజు గ్రామాల బాట పట్టడంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు వెంటరాగా యాలకల్లు పంచాయతీ పరిధి గ్రామాల్లో బుధవారం మీ గడప వద్దకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తు కార్యక్రమాన్ని కొనసాగించారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ "గౌరవ" సభలు పేరుతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గోనుమాకులపల్లి పంచాయతీ పరిధిలో బుధవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేతలు గ్రామాల్లో పర్యటించారు. ఒకే రోజు రెండు ప్రధాన పార్టీల అధినేతలు స్థానిక నేతలు గ్రామాల్లో చేపట్టిన యాత్రలు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.










