Apr 10,2023 21:06

ఎంఎల్‌ఎ మంతెన రామరాజు
ప్రజాశక్తి - కాళ్ల
ఏ గ్రామం వెళ్లినా తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వంటి ప్రధాన సమస్యలపై ప్రజలు నిలదీసే పరిస్థితి నెలకొందని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. కలవపూడి గ్రామ పంచాయతీ మోడీ ప్రాంతంలో జల జీవన్‌ మిషన్‌ నిధులతో చేపట్టిన పైపులైను విస్తరణ పనులను ఎంఎల్‌ఎ రామరాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామాలను అభివృద్ధి చేయాల్సి బాధ్యత ఉందన్నారు. వైసిపి పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. వారంలోపు పైపులైన్‌ విస్తరణ పనులు పూర్తిచేసి ప్రజలందరికీ పూర్తిస్థాయిలో తాగునీరందించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. మోడీలో సుమారు రూ.17 లక్షలు, కలవపూడి గ్రామంలో రూ.47.50 లక్షల నిధులతో సుమారు 700 మీటర్లు మేర చేపట్టిన పైప్‌లైన్‌ విస్తరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఎంఎల్‌ఎ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గేదల జాన్‌, టిడిపి గ్రామ అధ్యక్షుడు నంబూరి త్రినాధ మూర్తిరాజు, బి.దుర్గారావు, మాజీ ఉప సర్పంచి మంతెన వేణు పాల్గొన్నారు.