ప్రజాశక్తి - పాలకోడేరు
ఒక ఇంటి స్థలం విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రతిష్ట, గ్రామస్తుల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా పెట్టిన పోస్టుల కారణంగా ప్రశాంతతకు నిలయమైన గొరగనమూడిలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గొరగనమూడిలో వాలంటీర్‌గా పని చేస్తున్న పైడిపాల దుర్గ గ్రామంలో ప్రభుత్వ పట్టా భూమిని కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్న సమయంలో సరిహద్దుదారుడైన తంగెళ్ల శ్రీనివాస్‌తో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచి గొట్టుముక్కల వెంకట శివరామరాజు, (శి వాజీ రాజు), మాజీ సర్పంచి చెల్లబోయిన పాపారావు ఇరువురికి సర్దిచెప్పారు. దీనిపై మీడియా ఛానల్ అధినేతగా చెప్పుకుంటున్న సంకెళ్ల రాంబాబు సోషల్ మీడియాలో పాపారావుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో గ్రామస్తులంతా గ్రామ సభ ఏర్పాటు చేసి ఇటీవల జిల్లా ఎస్‌పి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇదిలా ఉండగానే దుర్గ పరిధిలో ఉన్న దళిత నేత గోడి పెద్దిరాజు, మాజీ సర్పంచి పాపారావుపై మరోసారి పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో గొరగనమూడి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమస్యను పార్టీలకు అతీతంగా అందరు నేతలకు, కులసంఘాల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మండలం నలుమూలల నుంచి రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో తరలొచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని 144 సెక్షన్, 30 అమల్లో ఉందని ఎటువంటి ఆందోళనా చేయడానికి వీల్లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామంలో వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తామంటూ గ్రామస్తులు ముత్యాలమ్మ మహంకాళమ్మ గుడి వద్ద నుంచి చినపేట, కొత్త కాలనీ పెదపేట మీదుగా జాతీయ రహదారి వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్ద మన్నె మహంకాళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచి శివాజీరాజు మాట్లాడారు. గ్రామంలో అంతా సోదరభావంతో జీవిస్తున్నామని, సంఘ విద్రోహకశక్తుల వల్ల గ్రామంలో విభేదాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా అంటే తమకు ఎంతో గౌరవం అని, రాంబాబు వంటి వారిపై మీడియా సంస్థలు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచి పాపారావు మాట్లాడుతూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విస్సాకోడేరు సర్పంచి బొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకెళ్ల రాంబాబు వంటి ఫేక్ విలేకరుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు. పివి రావు మాలమహానాడు రాష్ట్ర నేత పొన్నమండ బాలకృష్ణ, మాదిగ సంఘం జాతీయ నేత తెన్నేటి కిషోర్, గరగపర్రు ఆత్మగౌరవ ఉద్యమ నాయకులు సిర్రింగుల వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యురాలు డాక్టర్ రాజా స్వర్ణలత, గ్రామ పెద్దలు ఇంజేటి వెంకటేశ్వర్లు, దళిత ముఖ్య నేత దుండి అశోక్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల మధ్య చిచ్చు పెడుతున్న రాంబాబు, దుర్గపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరువురిని జిల్లా బహిష్కరణ చేసి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్‌కు సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. చర్యలు చేపడతామని డిఎస్‌పి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ, సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, శృంగవృక్షం, వేండ్ర సర్పంచులు జంగం సూరిబాబు, కడలి నాగేశ్వరి, మాజీ ఎంపిపి పాలా వెంకట చలపతి, ఉప సర్పంచి గూడూరి రామాంజనేయులు, వైస్ ఎంపిపి నరేష్, జానకి, పరమేశ్వరరావు, కలిదిండి కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.










