ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ సమాజంలో మూఢనమ్మకాలు, బాల్య వివాహాల నిర్మూలన, వితంతువులకు వివాహాల కోసం, మహిళల విద్యాభివృద్ధికి చైత్యన్యం కల్పిస్తూ సమాజాన్ని మార్పు దిశగా అడుగులు వేయించిన గొప్ప సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వేత్త కందుకూరి వీరేశలింగం పంతులు అని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అన్నారు. ఆదివారం ఐద్వా ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు గణేనాయక్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలనకు పోరాడిన మహనీయుడు అన్నారు. మహిళలు చదువుకోవాలని చైతన్యం నింపిన గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. వీరేశలింగం సతీమణి రాజ్యలక్ష్మితో వితంతు శరణాలయం స్థాపించి సేవలు అందించారని కొనియాడారు. వారు చూపించిన ఆదర్శ భావాలతో సమాజం మెలగాలన్నారు. మూఢనమ్మకాలు నిర్మూలించాలని, మహిళలపై హత్యలు, దాడులు నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, కోశాధికారి చంద్రిక, జిల్లా ఉపాధ్యక్షుల రామాంజినమ్మ, మహిళలు రజియా, మాధవి, మానస, సునంద, పార్వతి తదితరులు పాల్గొన్నారు.










