Apr 23,2023 22:12

ఘనంగా జయంతి వేడుకలు
ప్రజాశక్తి - తణుకు రూరల్‌

           లింగ వివక్షత లేకుండా అందరూ సమానమేనని, అందుకు కులరహిత సమాజం ఉండాలని చెప్పిన బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త అని శైవశ్రీ తాళ్ల సాంబశివరావు (గురు స్వామి) అన్నారు. బసవేశ్వరస్వామి జయంతి సందర్భంగా 39వ వార్షికోత్సవాన్ని కీర్తిశేషులు సప్పరపు గణపతి కుమారులు సప్పరపు కనక లింగేశ్వరరావు, సప్పరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో శైవశ్రీ తాళ్ల సాంబశివరావు (గురు స్వామి) సమక్షంలో 25 మంది శివ భక్తులు లింగ దీక్ష స్వీకరించారు. ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ కర్ణాటకలో బీజాపూర్‌ జిల్లా బాగేవాడలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో మండేన మాదిరాజు మాతాంబిక దంపతులకు జన్మించిన బసవేశ్వరుడు వైదిక కర్మకాండలను వ్యతిరేకించడంతో పాటు కుల మతాలకు కట్టుబాటు విధించడం సరికాదన్నారు. మనిషిని మనిషిగా చూడాలని, అహింస మార్గం ఉత్తమం అని, మహిళా హక్కులను ఆచరణలో పెట్టి చూపించారన్నారు. దయ, కరుణ, జాలి ఇవన్నీ మనుషులకు నిజమైన ఆభరణాలని సాటి చెప్పిన మహానుభావుడు బసవేశ్వరుడు అని ఆయన కొనియాడారు. అంటరానివాళ్లకు లింగధారణ చేసి కుల మతాలలో ఎక్కువ తక్కువ లేదని సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సప్పరపు శివకోటయ్య, సోరపల్లి బసవకోటయ్య, వాసా నరసన్న, కరెర్ల గుణ సత్యనారాయణ పాల్గొన్నారు.