ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకందజేస్తున్న జగనన్న గోరుముద్ద నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులను జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ హెచ్చరించారు. బుధవారం ఆయన పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాబూ అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాల, ఏఎంపుత్తూరు ప్రాథమికోన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, భాస్కరపేట మున్సిపల్ ఉన్నత పాఠశా లలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులకందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. పలు చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో నాణ్యత పెంచా ల్సిందిగా నిర్వాహకులను, ప్రధానో పాధ్యాయులకు సూచించారు. ఎవరైనా ఇళ్లనుంచి క్యారీ బాక్సులు తెచ్చుకున్నట్లు తెలిస్తే సంబంధిత పాఠశాల హెచ్‌ఎంపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. అనంతరం పది పరీక్షలపై విద్యార్థులకు దిశానిర్ధేశం చేశారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తయ్యిందో అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










