Jul 20,2023 21:08

తరుముకొస్తున్న వరద
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
పోలవరం కాపర్‌ డ్యామ్‌ వద్ద 32 మీటర్లకు చేరిన నీటిమట్టం
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 26 గ్రామాలకు రాకపోకలు బంద్‌
గొమ్ముగూడెంలో 253 కుటుంబాలు పునరావాస శిబిరాలకు తరలింపు
భయం గుప్పెట్లో ముంపు మండలాల ప్రజలు
కలెక్టరేట్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గోదావరి వరద తరుముకొస్తోంది. రోజురోజుకీ గోదావరి నీటిమట్టం ఉధృతంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులు ఉండగా గురువారం సాయంత్రానికి 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 29 మీటర్ల నుంచి 32 మీటర్లకు పెరిగింది. దీన్నిబట్టి వరద ఎంత ఉధృతంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది. గతేడాది వరదలతో తీవ్ర ఇబ్బందులు పడిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు మళ్లీ వరద భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతి కారణంగా వాగులు, వంకలు పొంగి కాజ్‌వేలు నీట మునుగుతున్నాయి. కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాజ్‌వేపై వరద నీరు చేరి బెస్తగూడెం, గొమ్ముగూడెం, దాచారం, నెమలిపేట వంటి 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు పొంగడంతో కాజ్‌వేపై వరద నీరు చేరి కొయిదా, కట్కూరు, యడవల్లి, చిగురుమామిడి, కాచారం, కొత్తూరు వంటి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద ఉధృతికి గోదావరికి ఆనుకుని ఉన్న కుక్కునూరు మండలం గొమ్ముగూడెం గ్రామంలోని 253 కుటుంబాలను ముందస్తు చర్యల్లో భాగంగా రావికుంట పునరావాస కాలనీల్లో ఏర్పాటు చేసిన శిబిరానికి గురువారం సాయంత్రం అధికారులు తరలించారు. గతేడాది జులైలో వచ్చిన వరదలకు గొమ్ముగూడెం ప్రజలు దాదాపు మూడు నెలలపాటు పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. మళ్లీ పట్టుమని తొమ్మిది నెలలు గడవకముందే మళ్లీ పునరావాస శిబిరానికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో గురువారం సైతం వర్షం కురుస్తూనే ఉంది. పైనుంచి వరద నీరు గోదావరిలోకి పెద్దఎత్తున చేరుతుండటంతో శుక్రవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 107 గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, క్లోరిన్‌ టాబ్లెట్లు, మెడికల్‌ క్యాంపుల ఏర్పాటు, పాముకాటు నివారణకు సంబంధించిన మందులు, గర్భిణుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్‌ దిశానిర్ధేశం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వాసితులకు కష్టాలు
గతేడాది వరదలకు వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు అతలాకుతలమయ్యాయి. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణంతో వేగంగా వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. అయినప్పటికీ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ఏడాది కాలంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో మళ్లీ వరద తరుముకొస్తుండటంతో జనం భయం భయంగా కాలం గడుపుతున్నారు. 2022 అక్టోబర్‌కు 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలకు పరిహారం అందించి తరలిస్తామని సిఎం ఇచ్చిన హామీ సైతం బుట్టదాఖలైంది. నిర్వాసితుల ఇబ్బందులకు ప్రభుత్వమే కారణం. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం నిర్వాసితులను వెంటాడుతోంది.
లంకలకు పడవ ప్రయాణాలు నిషేధం..
ప్రజాశక్తి - ఆచంట
వశిష్ట గోదావరికి వరద నీరు పోటెత్తడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి వరద గురువారం సాయంత్రానికి మరో రెండు అడుగుల మేర పెరిగింది. దీంతో లంక గ్రామాలకు ముందస్తు జాగ్రత్త చర్యగా పడవ ప్రయాణాలు నిషేధించారు. కరుగోరుమిల్లి పుష్కర ఘాట్‌ పూర్తిగా నీట మునిగింది. లంక గ్రామాలకు పడవ ప్రయాణాలు నిషేధించడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఇబ్బందులైతే వర్ణనాతీతం. పెదమల్లం గ్రామానికి చెందిన సుమారు 200కుపైగా పశువులు ఉన్నాయి. వీటి పోషణకు రైతులు రోజు ఉదయం, సాయంత్రం వెళ్లి పాలు తీసుకొస్తుంటారు. గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే పశువులను ఏటిగట్టుకు చేరుస్తారు. అప్పటి వరకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇప్పటి నుంచే పడవ ప్రయాణాలపై నిషేధం విధించడంతో ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లుతున్నారు. గోదావరి నీటిమట్టం మరో పది అడుగులు పెరిగినా ఎటువంటి ఇబ్బందీ లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.
గోదావరి వరద క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆచంట ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం సాయంత్రం జగనన్న సురక్ష కార్యక్రమం అయోధ్యలంక గ్రామంలో సర్పంచి కడలి కృష్ణవేణి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం గోదావరి ఇసుక ర్యాంపు నుంచి నీటిలో కొంతమేర నడుచుకుంటూ వరద పరిస్థితిని సమీక్షించారు.