కనకాయలంకలో తప్పని పడవ ప్రయాణం - ఊపిరి పీల్చుకున్న లంక గ్రామాల ప్రజలు, అధికారులు
ప్రజాశక్తి - ఆచంట
మండలంలో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన వశిష్ట గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో శనివారం మండలంలో పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్లు వద్ద కూడా వరద గోదావరి తగ్గుముఖం పట్టి రెండు అడుగుల మేర నీరు తగ్గింది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం సాయంత్రానికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో పడవల రాకపోకలపై నియంత్రణ ఇంకా కొనసాగుతోంది.
వీడని ముసురు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనాన్ని స్తంభించింది. వర్షం ఒక మోస్తరుగానే కురుస్తున్నా తెరిపివ్వకుండా కురవడంతో జనం గడప దాటి బయలకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. జోరు వర్షాల కారణంగా నాట్లు ఆలస్యమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
యలమంచిలి: గోదావరి వరద ఉధృతి శనివారం కూడా నిలకడగా కొనసాగింది. దీంతో మండలంలో వరద ప్రభావిత ప్రాంతమైన కనకాయలంకలో ప్రజలు రాకపోకలకు పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. విద్యార్థులు సగానికి సగంపైగా పాఠశాలలు, కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నారు. శనివారం రాత్రికి కొంత వరద ప్రభావం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన వీడలేదు. మూడు రోజులుగా పనుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం వెంటనే నిత్యావసర సరుకులను అందించి ఆదుకోవాలని టిడిపి నాయకుడు ముస్కూడి రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.










