గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
నగర కమిషనర్ అరుణ
ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్
నగరంలోని కట్టమంచి చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ తెలిపారు. నగరపాలక ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది కట్టమంచి చెరువు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం కోసం చెరువు కట్టపై షామియానాలు ఏర్పాటు చేశారు. టేబుళ్లను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను, పూజా సామాగ్రిని నగరపాలక సంస్థ సిబ్బంది స్వీకరిస్తున్నారు. విగ్రహాలను పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా చెరువు కట్టను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, పూజ సామగ్రి, ఇతర పదార్థాలను ఎప్పటికప్పుడు వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రజల కోసం తాగునీటిని ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం అధిక సంఖ్యలో నగర ప్రజలు తరలివచ్చి తమ ఇళ్లలో పూజించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేపట్టారు. ఇంజనీరింగ్ విభాగం డీఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.










