తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి గ్రామంలో టిడిపి, వైసిపి నేతల మధ్య మంగళవారంర రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టిడిపికి చెందిన నలుగురు కార్యకర్తలు, వైసీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలో మేజర్ పంచాయతీ అయిన గన్నెవారిపల్లిని ఇటీవల రెండుగా విభజించారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి సర్పంచిగా, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఎంపిటిసి అభ్యర్థి విజయం సాధించారు. టిడిపి, వైసిపి రెండు పార్టీలు బలంగా ఉండడంతో ముందునుంచి ఇక్కడ ఈ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గతంలో పంచాయతీ సర్పంచి ఉమామహేష్ ఆధ్వర్యంలో అండర్ డ్రైయినేజీ కోసం ఇంటింటి నుంచి డబ్బులు వసూలు చేశారని, దీంతో పాటు మరికొన్ని అభివద్ధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీటీసీ రవికుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు విచారణకు వచ్చి అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. అప్పటినుంచి ఘర్షణ వాతావరణం కొనసాగుతూ ఉంది. గన్నెవారిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి సర్పంచి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జూలై 10న ఎంపీటీసీ రవికుమార్ అనంతపురం కలెక్టర్ కార్యాలయం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ముందు నుంచి కొనసాగుతున్న ఇరువర్గాల మధ్య ఉన్న వైరాలు ఈ ఫిర్యాదులతో తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో టిడిపి వార్డు మెంబర్ గోపాల్‌ను కొందరు వైసీపీ నాయకులు కొట్టారని బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తుండగా పరామర్శించడానికి వెళ్లిన ఆ గ్రామ వైస్ సర్పంచి, టిడిపి నాయకుడు చింబిలి వెంకట రమణ, రాంబాబు, అమీర్ బాషాలను ఆసుపత్రి ఆవరణంలో వైసిపి నాయకులు కట్టెలు, కత్తులతో కొట్టారని బాధితులు తెలియజేశారు. ఈ ఘర్షణలో వైసీపీ నాయకులు రవికుమార్, వీర, వినరులు కూడా గాయాలయ్యాయని వైసిపి నాయకులు తెలిపారు. సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఇరువర్గాల ఫిర్యాదు మేరకు టిడిపికి చెందిన నలుగురు, వైసిపికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గన్నెవారిపల్లిలో ముందస్తుగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాధితునికి జెసి అస్మిత్‌రెడ్డి పరామర్శ
వైసిపి నాయకుల దాడిలో గాయపడి అనంతపురం నగరంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైస్ సర్పంచి చింబిలి రమణను బుధవారం తాడిపత్రి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి జెసి అస్మిత్ రెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పరామర్శించారు. అనంతరం అస్మిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి నాయకులు తాడిపత్రి మండల పరిధిలోని గన్నేవారిపల్లి పంచాయతీలో అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయడం తప్ప అని ప్రశ్నించారు. చేతనైతే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని హితవు పలికారు. దాడులకు పాల్పడడమే మీ మగతనమా అని ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు భయపడమని, ఇకపై ఇంతకంటే బలంగా పోరాడుతామని హెచ్చరించారు










