పజాశక్తి-గుంతకల్లు : కలెక్టర్ ఎమ్.గౌతమి బుధవారం నాడు గుంతకల్లు డివిజన్‌లోని పలు మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పామిడి గ్రామం, నాగిరెడ్డి కాలనీ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. జూన్‌లోగా పాఠశాలలో నాడు-నేడు పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ పరిస్థితులను సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామ సచివాలయం తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ వైఎస్సార్ బీమా పథకంలో నమోదు చేయించాలన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో రూ.20 లక్షల మేరకు చేపట్టే పనుల అంచనా వ్యయాలు తయారు చేయాలని సర్పంచి రంగమ్మకు సూచించారు. పత్తి పంటలో నష్టపోయిన స్థానిక రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు త్వరలోనే జీతాలు చెల్లిస్తామని తెలిపారు. పామిడి మండలం నుంచి గుత్తిలో పర్యటించారు. గుత్తి పట్టణం నేమతాబాద్ అర్బన్ హౌసింగ్ లే అవుట్‌ను పరిశీలించారు. గుంతకల్లు దోనముక్కల హౌసింగ్ లే అవుట్‌నూ సందరించారు. దోనముక్కల హౌసింగ్ లేఅవుట్‌లో గుంతకల్లు మునిసిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్ నైరుతి రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ జగనన్న ఇల్లు లబ్ధిదారురాలు అలశ్యాము సౌమ్య ఇంటి గహ ప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. మే లో నిర్వహించనున్న మెగా గహ ప్రవేశ కార్యక్రమానికి లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇళ్ల పట్టా పొందిన ప్రతి డ్వాక్రా మహిళకు 35,000 రూపాయల రుణం అందించాలని అధికారులకు సూచించారు. డ్వాక్రా సంఘాల్లో లేని మహిళలకు సంఘాలలో సభ్యత్వం కల్పించాలన్నారు. రుణం పొందేందుకు కనీసం ఆర్నెళ్లు సంఘంలో సభ్యత్వం ఉండాలనే నిబంధనను సవరించి రుణం మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల కబ్జాలపై విచారణ చేపట్టాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. బోగస్ పట్టాల వివరాలు తేల్చి వాటిని 90 రోజుల్లో ఇళ్ల పట్టా దరఖాస్తుదారులకు అందించాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామనే హెచ్చరికలు జారీ చేయాలన్నారు. అనంతరం గుంతకల్లు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ పనుల గురించి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. వజ్రకరూరు జగనన్న లే అవుట్‌ను తనిఖీ చేసి, ందులో నిర్మాణాల పురోగతిపై సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










