
* విశాఖ రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం, రణస్థలం రూరల్: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్.హరికృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జె.ఆర్‌పురం, జలుమూరు పోలీస్‌స్టేషన్లతో పాటు శ్రీకాకుళం రూరల్ సర్కిల్ కార్యాలయాలను మంగళవారం సందర్శించారు. రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, మహిళలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు ఎక్కడా లేదని, ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమ రవాణా సాగుతోందని చెప్పారు. అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టామన్నారు. ఒడిశా సరిహద్దులో మూడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, వీటితో పాటు మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళిక ప్రకారం కార్యాచరణను రూపొందించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. విద్యుద్దీపాలు లేని చోట ఏర్పాటు చేయాలని హైవే అధికారులకు చెప్పామన్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహనాల ద్వారా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించామన్నారు. గ్రామాల నుంచి జాతీయ రహదారికి వచ్చే ప్రదేశాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని నివారించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామస్థాయిలో ప్రతిరోజూ సందర్శించి అసాంఘిక కార్యకలాపాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌పి జి.ఆర్ రాధిక, ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు శృతి, బాలచంద్రారెడ్డి, సిఐ ఆదాం, ఎస్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.