గజరాజుల బీభత్సం
రూ.3 లక్షల ఆస్తి నష్టం
కన్నీరుపెడుతున్న రైతన్నలు
చోద్యం చూస్తున్న అటవీశాఖ
ప్రజాశక్తి- గంగవరం:
పంట పొలాలపై గజరాజుల బీభత్సం సష్టించి సుమారు మూడు లక్షలు విలువైన పంటలను ధ్వంసం చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మేలూమయి పంచాయతీ చిన్నమనాయన పల్లె గ్రామానికి చెందిన తలారి రామచంద్ర అనే రైతుకు చెందిన టమోటా, మామిడి, టేకు, కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. అప్పులు చేసి ఆరుకాలం కష్టించి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో ఆర్థికంగా చితికిపోతున్నామన్నారు. చుట్టుపక్కల రైతులు ఏ పంటలు చేయాలన్నా ఏనుగుల విధ్వంసం తప్పదని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తుందని ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఏనుగుల దాడుల నుండి రైతులను కాపాడాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఏనుగులు యథేచ్ఛగా పంట పొలాలపై దాడులు చేస్తున్న పట్టించుకునే నాథుడే లేడా అంటూ రైతులు బోరుమంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న నష్టపరిహారం కూడా చాలా తక్కువగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగుల దాడులను అరికట్టి రైతులను ఆదుకోవాలన్నారు.










