గజ దాడుల్లో... రైతు మృతి..!
పారిశుధ్య కార్మికునికి తీవ్రగాయాలు
భయాందోళనలోఅటవీ సమీప గ్రామాలు
ప్రజాశక్తి - గుడిపల్లి
శనివారం రాత్రి ఏనుగుల గుంపు గుడిపల్లి మండలం ఒఎన్‌కొత్తూరు గ్రామ పంచాయతీ శ్రీనివాసపురం గ్రామంలో సంచరిస్తూ పొలం సమీపంలో ఉన్న రైతు గోవిందు (45)ను వెనకనుంచి దాడిచేసిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. పారిశుధ్య కార్మికుడు నాగరాజు (55)ను కాలితో తొక్కి తొండంతో విసిరివేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల గ్రామస్తులు 108 సాయంతో నాగరాజును కుప్పం పిఇఎస్ మెడికల్ కళాశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. గోవిందు పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
గోవిందు తమిళనాడు సరిహద్దు ఏకలనత్తం నివాసి. నాగరాజు సమీపంలోని టీ అంగట్లో తాగడానికి వెళుతుండగా ఏనుగులు దాడి చేశాయి. నాగరాజుకు నలుగురు పిల్లలు. భార్య తంజమ్మ (50).. ఈ ఘటనతో సమీప గ్రామాలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్నాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది మదన్‌మోహన్‌రెడ్డి, కృష్ణప్రసాద్ బృందంతో సంచరిస్తూ గుర్తుల ఆనవాళ్లను బట్టి నాలుగు ఏనుగుల గుంపు ఉండవచ్చని భావిస్తున్నారు. అడవి వైపు తరిమేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాత్రుల్లో పొలాల వద్ద తిరగరాదని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిత్యం భయం గుప్పెట్లో బతకలేమని, ఏనుగులు, అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, సోలార్ కంచెలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
టిడిపి నేతల పరామర్శ
ఏనుగుల దాడిలో గాయపడిన నాగరాజు పిఇఎస్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడని విషయం తెలుసుకున్న మాజీ సిఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, మాజీ జడ్‌పిటిసి బేటప్పనాయుడు పరామర్శించారు. అన్ని విధాలా వైద్యసాయం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు.
మృతుని కుటుంబానికి లక్ష పరిహారం
గజదాడుల ఘటనను తెలుసుకున్న డిఎఫ్‌ఒ సునీల్‌కుమార్‌రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు.దాడిలో మృతిచెందిన గోవిందు కుటుంబానికి తక్షన సాయంగా లక్ష రూపాయలు నష్టపరిహారంగా ప్రకటించారు. నాగరాజుకు సంబంధించి వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని తెలిపారు. సోలార్ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అటవీ సిబ్బందిని ఆదేశించారు. వైసిపి సర్పంచులు అమరరాజు, దేవప్పనాయుడు, వైస్ ఎంపిపి శ్రీనివాసులు, నాయకులు ఎన్.రవి పాల్గొన్నారు.










