
* అత్యవసర సమయంలో తప్పని అవస్థలు
ప్రజాశక్తి- బూర్జ: దశాబ్థాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారుతున్న ప్రతిసారి తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశ పడ్డ తమకు నిరాశ ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అల్లిపల్లిగూడ గ్రామంలో సమస్యలు వేధిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామం నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రోడ్డు మొత్తం దమ్ముల మడిలా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రేషన్ వాహనం కూడా రావడం లేదన్నారు. ఎమర్జెన్సీ వాహనాలు కూడా రావటం లేదని, దీంతో కొంత వరకు ద్విచక్రవాహనంపై తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అలాగే గ్రామానికి కూడా 104, 108 వాహనాలు రావడం లేదని తెలిపారు. ముఖ్యంగా సీతంపేట ఐటిడిఎకు మహిళా పిఒ రావడంతో తమ సమస్యలను పట్టించుకుంటారని, పరిష్కరిస్తారని ఎంతో ఆశించామని అయితే ఆమె కూడా ఇంతవరకు పట్టించుకోలేదని బూర్జ మండలం ఆదివాసి సంక్షేమ పరిషత్ శోభన్ తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు.