
* డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత
* గోతులు కప్పుతుంటే కొట్టడంపై టిడిపి నేతల నిలదీత
ప్రజాశక్తి - పలాస: గిరిజన ట్రాక్టర్ డ్రైవర్‌పై కాశీబుగ్గ రూరల్ సిఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్ ఖాదర్‌భాషా చేయి చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరం ముందు గోతులు పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో తీసుకొచ్చిన క్రషర్‌ను వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తాము కేవలం గోతులు మాత్రమే కప్పుతున్నామని పోలీసులకు వివరించారు. వారు చెప్పింది వినకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని, ట్రాక్టర్‌ను పక్కకు పెట్టాలని సిఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. లొత్తూరుకు చెందిన గిరిజన డ్రైవర్ సవర వల్లభరావు ట్రాక్టర్‌ను పక్కకు పెడుతున్న సమయంలో సిఐ శంకరరావు చెంప చెల్లుమనిపించారు. ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా కూడా చేయి చేసుకున్నారు. ట్రాక్టర్‌తో పాటు డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లొడగల కామేష్ యాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, కౌన్సిలర్ జి.సూర్యనారాయణ, పట్టణాధ్యక్షులు బడ్డ నాగరాజు తదితరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు ఉపక్రమించారు. వారిని పోలీసులు అడ్డుకొని నోటీసులపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారు. అందుకు టిడిపి నాయకులు నిరాకరించారు. రహదారిపై గుంతలు వైసిపి నేతలు కప్పలేకపోతున్నారని, తాము ఆ పనిచేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని టిడిపి నాయకులు ప్రశ్నించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గిరిజన డ్రైవరుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజన డ్రైవరుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని గిరిజన సంఘం నాయకులు సవర రాంబాబు అన్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన ట్రాక్టర్ పలాసకు చెందిన వైసిపి నాయకుడిది కావడంతో వెంటనే విడిచిపెట్టారు. గిరిజన డ్రైవర్‌పై సిఐ చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.