Aug 30,2022 22:13

గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే
ఎస్టీ కమీషన్‌ చూస్తూ ఊరుకోదు..!
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎస్టీ కమీషన్‌ చూస్తూ ఊరుకోదంని రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంఖర్‌ నాయక్‌ పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎస్‌.మూర్తితో కలిసి చిత్తూరు పట్టణం, ఎస్టేట్లో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇటీవల పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యయత్నం సంఘటనపై మంగళవారం మధ్యాహ్నం పాఠశాలను పరిశీలించడం జరిగింది. ముందుగా పాఠశాలలోని వంట గది, భోజనశాల, కూరగాయలు నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో పాఠశాలలో ఇటీవల చోటు చేసుకున్న విద్యార్థి ఆత్మహత్యయత్నంపై, వారి సమస్యలపై ఆరా తీశారు. అలాగే భోజనం నాణ్యతగా ఉందా లేదాని అన్ని సబ్జెక్టులకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారాని వంటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం, సాంబారు, రసం, మజ్జిగ సరిగా లేవని, ఇంగ్లీషు సబ్జెట్‌కు టీచర్‌ లేరని, వాచ్‌మెన్‌ కూడా లేరని విద్యార్థులు కమీషన్‌ సభ్యలకు వివరించారు. అనంతరం ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులతో జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తన దష్టికి సమస్యలు తీసుకురావడం జరిగిందని వెంటనే వాటిని పరిష్కరించి ఇకపై ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యయత్నంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థిని ఇబ్బంది పెట్టిన సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా గిరిజనలకు అన్యాయం జరిగితే అక్కడ ఎస్టీ కమీషన్‌ ఉంటుందన్నారు. ఈసంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లి ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చెప్పటి చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్‌తో మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అనిల కుమారి, పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.