Apr 17,2023 22:23

స్పందనలో అర్జీ దారుని సమస్యను తెలుసుకంటున్న జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

       అనంతపురం కలెక్టరేట్‌ : నిర్ణీత గడువులోపే స్పందన అర్జీలకు పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. భూగర్భ గనులు, జిల్లా ఉపాధి కల్పనాధికారి, కూడేరు, నార్పల, రాప్తాడు తహశీల్దార్లు, ఉరవకొండ గ్రామ వార్డు సచివాలయానికి చెందిన మండల అధికారులకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున ఆరు అర్జీలు మరో 24 గంటల్లో గడువు తీరనున్నందున వెంటనే వాటిని నాణ్యతగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన కణేకల్‌ ఈవో, ఉరవకొండ ఉద్యాన శాఖ అధికారి, గార్లదిన్నె, రాప్తాడు మండల సర్వేయర్లు ఇన్‌కరెక్ట్‌ ఎండార్సెమెంట్లను అర్జీదారులకు పంపారని, వాటిని వెంటనే సరిచేసి పంపాలన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలకు సంబంధించిన అధికారులు ఆ సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను ఇంకా పంపలేదని వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే చర్యల నివేదికను సిపిఒకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఅర్‌ఒ గాయత్రిదేవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, అన్సెట్‌ సిఇఒ కేశవనాయుడు, ఆర్డీవో మధుసూదన్‌, జెడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.