ప్రజాశక్తి-ఆత్మకూరు మండల స్థాయిలో నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపించాలని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కనకదాస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతివారం బుధవారం, శుక్రవారాల్లో మండల స్థాయి జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి 46 అర్జీలను స్వీకరించారు. కాగా పేదరికంలో మగ్గుతున్న రెడ్లను అదుకోవాలని ఎపి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జెసికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భూమిలేని వారికి భూమి, ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అంతకుముందు ఆత్మకూరులో నిర్వహించిన కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొని పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు కూడా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. తర్వాత సచివాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ స్పెషల్ క్యాంపెయిన్‌ని పరిశీలించారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని పంపనూరు వద్ద ఉన్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలవలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు సుధారాణి, వెంకటేశ్వర్లు, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఇహషాన్‌బాషా, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్










