Nov 01,2023 23:28

మాట్లాడుతున్న వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు: టిడిపి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శివాజీ నిర్లక్ష్యమే వంశధార శివారు ప్రాంతం రైతులకు శాపంగా మారిందని వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పూండి సామాజిక భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శివాజీ హయాంలో అప్పటి మంత్రి కింజరాపు అచ్చంనాయుడు టెక్కలి నియోజకవర్గంలో 17 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తుంటే శివాజీ మిన్నుకుండిపోయారని అన్నారు. పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి అప్పలరాజును విమర్శించే స్థాయి యార్లగడ్డ శిరీషకు లేదన్నారు. వాస్తవాలు మాట్లాడి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేయాలే తప్ప మంత్రిని చులకన చేసి మాట్లాడితే విజ్ఞులైన ప్రజలు టిడిపి నాయకులకు సరైన బుద్ధి చెబుతారన్నారు. ఇంకొకసారి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అట్టాడ గోపి, తుంగాను సుశీల, గోవిందపురం ఎంపిటిసి లోకనాథం, పాతటెక్కలి ఎంపిటిసి బాలక శ్రీను, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జల్లు ఉషారాణి పాల్గొన్నారు.