'గార్గేయ నది' వంతెన
పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- సోమల
మండల కేంద్రమైన సదుం వద్ద గార్గేయ నదిపై నూతనంగా రూ.6 కోట్ల నిధులతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీవర్షాల కారణంగా బ్రిటిష్ కాలంనాటి వంతెన కొట్టుకుపోవడంతో నూతన వంతెన నిర్మాణ పనులకోసం నిధులు కేటాయించి పనులను వేగవంతంగా చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం సదుం మండలం ఎర్రాతివారిపల్లె గ్రామంలో వెలసిన శ్రీకోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులను పరిశీలించారు. జిల్లాలోని అత్యంత ఆదరణ పొందిన ఆలయంగా నిత్యం భక్తుల తాకిడితో అయ్యప్పస్వామి సన్నిధి విరాజిల్లుతోంది. ఆలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తాపడం పనులు మంత్రి తన సొంత ఖర్చుతో చేయిస్తున్నారు. బంగారు తాపడం పనులను పరిశీలించి అనంతరం ధ్వజస్తంభానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.










