May 10,2022 22:26

గాలివానకు రూ.15 కోట్లు నష్టం
కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు
500 ఎకరాల పంటనష్టం
నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు
దెబ్బతిన్న 70 పట్టు పురుగుల షెడ్లు
ప్రజాశక్తి- శాంతిపురం
ప్రకతి విలయతాండవానికి అపారనష్టం వాటిల్లింది. సోమవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి రూ.15 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని బెల్లకోగిల, అనికెర, రేగడదిన్నెపల్లె, సోగడబల్ల, చెంగుబల్ల, శెట్టిబల్లె, శివకురుబురు, మరసనాపల్లె, వడ్డీవాని కొత్తూరు తదితర గ్రామాలపరిధిలోని వరి, టమోటా, బీన్స్‌, కాకర, సొరకాయ, మామిడి అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 70 పట్టుపురుగుల షెడ్లు ధ్వంసమైనాయి. శివకురుగురు, బెల్లకోగిల గ్రామాలలో షెడ్యూల్‌లోనే పురుగులు పంట సైతం పూర్తిగా దెబ్బతింది. మరుసనపల్లి, తులసినాయినిపల్లె వద్ద నర్సరీ గ్రీన్‌హౌస్‌లు నాశనమయ్యాయి. మండలంలో సుమారు 100ఎకరాల టమోటా పంట నేలమట్టమైంది. కురిసిన వడగళ్లవానకు మామిడి కాయలన్నీ పగిలిపోయాయి. 20 ఎకరాల్లోని వరి పంట నెలకొరిగింది. 50 ఎకరాల అరటి పంట నేలమట్టమైంది. 150 ఎకరాల మామిడి నేలరాలింది. 110 ఎకరాల్లో బీన్సు, కాకర, సొరకాయ, చిక్కుడు, బీరకాయ వంటి పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం టమోటా మార్కెట్లలో 18కిలోల బాక్సు రూ.800లు పలుకుతుంది. నాలుగు కాసులు సంపాధించుకుందామన్న సమయంలో చేతికొచ్చిన టమోటా పంట గాలివాన బీభత్సానికి దెబ్బతినడంతో రైతన్నల విలవిలలాడిపోతున్నారు. కళ్ల ముందు పంట నష్టం రావడంతో చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే కరేగానూరూ గ్రామంలో మూడు పూరిగుడిసెలు నేలమట్టమైనాయి. గుడిసెలు గాలికి రెచ్చిపోవడంతో రాత్రంతా వర్షంలో తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారి అపోజీ పరిశీలించారు. సిరీస్‌కల్చర్‌ అధికారులు పట్టుపురుగుల షెడ్డును పరిశీలించారు. రెవెన్యూ అధికారులు గాలివానకు మండలంలో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. అలాగే 100విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 50 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి పోయిన కరెంటు మంగళవారం సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా కాలేదు దీంతో గ్రామాలన్నీ చీకట్లోనే గడిపాయి. టౌన్‌పరిధిలోని దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలను సరిచేసి మంగళవారం సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ప్రకతి విలయ తాండవంలో భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
షెడ్డు కూలి ఆవు మృతి
బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని గంగినాయనపల్లి గ్రామంల్లో సోమవారం రాత్రి గాలివానకు తాత్కాలికంగా నిర్మిచించిన షెడ్డు కూలి ఆవు మృతి చెందింది. పాడి రైతు భాగమ్మ తమ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేసింది. పశువైద్యాధికారులు మోహన్‌ ఆవుకు పోస్టుమార్టం నిర్వహించి ఇన్సూరెన్స్‌ కవరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు
గంగవరం: తుపాన్‌ ప్రభావంతో మండలంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. దీంతో మేలుమాయి గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వైసిపి మండల యూత్‌ అధ్యక్షులు ఎస్‌. వినోద్‌కుమార్‌ రెడ్డి, సర్పంచ్‌ పవన్‌, ఎంపిటిసి శ్రీధర్‌ స్పందించి విద్యుత్‌ శాఖ అధికారుల సాయంతో మరమ్మతులు చేయించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. అలాగే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లైన్‌ మాన్‌ సకాలంలో స్పందించి మరమ్మతులు చేయించడంపై గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
గాలివానకు కూలిన విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షం
వికోట: మండల పరిదిలోని గుమ్మరెడిపల్లె గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీవర్షం, ఈదురు గాలులకు భారీ వృక్షం విద్యుత్‌ తీగలపై ఒరిగి పడిపోయింది. దీంతో రాత్రి నుండి విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. దీనివలన గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా అరటి తోటలు, మామిడి కాయలు నేలరాలాయి.
నేలకూలిన కోళ్ల షెడ్డు
బంగారుపాల్యం: మండలంలోని రాగిమానుపెంట పంచాయతీ బిఎల్‌కండిగ గ్రామంలో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు రైతు ప్రసాద్‌బాబు నూతనంగా నిర్మించిన కోళ్ల షెడ్డుపై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. రైతు మాట్లాడుతూ 70 వేల రూపాయలు వెచ్చించి కోళ్ల షెడ్‌ నిర్మిస్తుండగా ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు నేలకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. దీంతో రైతులు నష్టాలు తప్పవని వాపోతున్నారు.
వర్షం వల్ల విద్యార్థుల ఇక్కట్లు
కార్వేటినగరం: కార్వేటినగరంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు వర్షం పడడంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండిపోయారు. రెండు రోజుల కితం వచ్చిన గాలివానకు విద్యుత్‌ స్తంభాలు కూడా వాలిపోవడంతో విద్యుత్‌ సరఫరా అంతంతమాత్రం గానే ఉంది. దీంతో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుఉన్నారు. పరీక్షల సమయంలో కూడా ఇలా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఎలా చదవగలరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అలాగే రోజు ఏదో ఒక సమయంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోతుందని ఆరోపించారు. ఇకనైనా విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.