Mar 30,2023 22:00

గుట్టూరులో వక్కలిగ సామాజిక వర్గీయులతో మాట్లాడుతున్న నారా లోకేష్‌

ప్రజాశక్తి-పెనుకొండ    గాలికొచ్చిన ప్రభుత్వం.. గాలికే పోతుంది..అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. గురువారం పెనుకొండ మండలం హరిపురం సమీపంలోని విడిది కేంద్రం నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. హరిపురం గ్రామస్తులతో మాటామంతి చేపట్టారు. ఎర్రమంచి వద్ద కియా కార్ల పరిశ్రమ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. అమ్మవారిపల్లిలో స్థానికులతో భేటీ అయ్యారు. లోకేష్‌ పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా గుట్టూరు గ్రామంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గుట్టూరులో రహదారి పక్కన వక్కలిగ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. పలు సమస్యలను వారు లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాళ్లపల్లి, రత్నగిరి రిజర్వాయర్లను నిర్మించాలని కోరారు. వక్క తోటలు, మల్బరి రైతుల ఇబ్బందులను లోకేష్‌కు వివరించారు. టిడిపి అధికారంలోకి వస్తే అందరి సమస్యలూ పరిష్కరిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌ రాయలసీమ బిడ్డ కాదని.. సీమకు పడ్డ క్యాన్సర్‌ గడ్డ.. అని ఎద్దేవా చేశారు. గాలికొచ్చిన ప్రభుత్వం..గాలికే పోతుందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దామాషా పద్ధతి ప్రకారం వక్కలిగలకు నిధులు కేటాయిస్తామని అన్నారు. వక్కలిగలను టిడిపి రాజకీయంగా ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో వక్కలిగలను మంత్రి, ఎమ్మెల్యే చేసిన ఘనత టిడిపిదే అన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో హెచ్‌బి.నరసయ్యకు న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించామన్నారు. పట్టు రైతులకు ఈ ప్రభుత్వం పెట్టిన రూ.45 కోట్ల బాకీని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మడకశిరలో వక్క మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమకు తెచ్చిన నీరు వృథా కాకుండా డ్రిప్‌ ద్వారా పంటలకు అందించామన్నారు. 90 శాతం సబ్సీడీతో డ్రిప్‌ ఇస్తుంటే జగన్‌ రద్దు చేశాడని తెలిపారు. మడకశిర పరిధిలో టిడిపి హయాంలో పట్టు రైతులకు 1000 షెడ్లు నిర్మించామన్నారు. హంద్రీనీవా కాలువ పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. 10 శాతం పనులు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసిపి అని ఎద్దేవా చేశారు. వక్కలిగలను ఒబిసిలో చేర్చడంపై బిసి కమిషన్‌ నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టిడిపి హయాంలో తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక పెద్దలతో చర్చించి కర్నాటక, తమిళనాడులో చదివే ఎపి విద్యార్థుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్థానికంగా మంచి కాలేజీలు, యూనివర్సీటీలు తీసుకొస్తే బయటకు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. వైసిపి ప్రభుత్వం అడ్డగోలుగా బిసిలపై కేసులు పెడుతోందని, టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే బిసిల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు. కేసులు రివ్యూ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసిపి ప్రభుత్వం తొలగించడంతో 16 వేల పదవులను బిసిలు కోల్పోయారన్నారు. టిడిపి స్థాపనతోనే బిసిలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే బాధ్యతను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. అనంతరం లోకేష్‌ యువగళం పాదయాత్ర చెన్నేకొత్తపల్లి మండలం కోన మలుపు వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది. రాత్రి లోకేష్‌ అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిమ్మల క్రిష్టప్ప, గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసమూర్తి, వక్కలిగ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.