Jun 23,2023 11:50

ప్రజాశక్తి-ఉండి(పగో) : ఉండి పెద్ద వంతెన సెంటర్లోని పద్మజా స్టూడియో రెడీమేడ్ లో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి భీమవరం అగ్నిమాపక శాఖకు తెలియజేయగా జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి సూర్య ప్రకాష్ రావు ఆధ్వర్యంలోని అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు స్పందించి తమకు తెలియజేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా మంటలను అదుపులోకి తెచ్చామని షాపు యజమాని ఊరు వెళ్లడంతో ఆయన భార్య ఒక్కరే షాపుపై అంతస్తులోని ఇంటిలో ఉన్నారని వారు తెలియజేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరగవచ్చు అని అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చు అని వారు భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాసరావు, భీమవరం డిఎస్పి బి శ్రీనాథ్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ షాపు యజమాని ఫోటోగ్రాఫర్ కావడంతో వారు వాడే కెమెరాలు సుమారు 5 లక్షల రూపాయలు విలువ ఉంటాయని ఈ ప్రమాదంలో అవి దగ్ధమవడంతో ఆస్తి నష్టం ఎక్కువగానే ఉండొచ్చని వారు తెలిపారు స్థానికులు గ్రామస్తులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించాలని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.