ప్రజాశక్తి - కాళ్ల : ఆరుగాలం పండించిన 1153 వరిరకం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వెంటనే కొనుగోలు చేయాలంటూ కాళ్ళ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధాన్యతో రైతులుఆందోళన చేపట్టారు. దొడ్డనపూడి గ్రామ రైతులు సుమారు 60 ఎకరాలు సాగు చేపట్టారు. భూమి యొక్క స్వభావాన్ని బట్టి, వాతావరణం పరిస్థితులు బట్టి ఎం టి యు 1153 రకాన్ని సాగుచేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈ క్రాఫ్ లో నమోదు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల కష్టపడి మాసూలు చేయాల్సి వచ్చింది. ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ ఐకెపిల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన మా మొర ఆలకించేవారు కరువయ్యారు. సుమారు వారం రోజుల నుంచి ధాన్యం రాశుల వద్ద కాపలా కాయాల్సి వస్తుంది. అధికారుల చుట్టూ తిరుగుతున్న1153 వరి రకాన్ని కొనుగోలు చేయమంటూ సమాధానం చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ఎలా అమ్మాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు మూడు గంటలపాటు ధర్నా కొనసాగించారు. బాధిత రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే మంతెన రామరాజు, మండల టిడిపి అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మాజీ సర్పంచ్ బండారు వేణుగోపాలరావు, మాజీ ఎంపీటీసీ ఆరేటి గాంధీ, పుప్పాల వాసు, కొల్లి శ్రీనివాస్ తదితరులుధర్నా లో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ.. 1153 రకం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతు ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంతి,ఆర్డీవో దాసిరాజు,రైస్ మిల్లర్ ల దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దార్ కృష్ణారావు, ఎవో సిహెచ్.జయవాసుకి, తదితరులు చర్చించారు.1153 ధాన్యాన్నికి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఆర్డివో దాసిరాజు హుటా హుటిన కాళ్ల తాసిల్దార్ కార్యాలయానికి వచ్చి రైతులు, ఎమ్మెల్యేతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుండా రైతులతో కలిసి ఉద్యమిస్తానన్నారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.










