
మన భారతీయ ఆహార సంస్థ వద్ద పుష్కలంగా ఆహార ధాన్యాల నిల్వలున్న సంగతి, ఇటీవల కాలంలో ఈ విధంగా నిల్వలు పేరుకుపోవడం పరిపాటి అయిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిని బట్టి మన దేశంలో అవసరాలకు మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిపోతోందని నిర్ధారించడం అంటే అది తప్పుల్లోకెల్లా పెద్ద తప్పు అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన ప్రతిసారీ ఆహార ధాన్యాల నిల్వలు తరిగిపోవడం, అదే కొనుగోలు శక్తి తగ్గిపోయిన ప్రతిసారీ ఆ నిల్వలు పేరుకుపోవడం జరుగుతోంది. అంతే కాని మన దేశంలో అవసరాలకు మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినందువలన కాదు.
పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ వర్గాలు తమ స్వప్రయోజనాల కోసం ముందుకు తెచ్చే వాదనలన్నింటినీ ఆబగా దిగమింగే స్వభావం మన భారతదేశ ''మేధావుల''కు వుంది. ఆ వాదనలే గొప్ప ఆర్థిక విజ్ఞానంగా ఈ మేధావులు పరిగణిస్తూంటారు. మన ఆహార ఆర్థిక వ్యవస్థ గురించి ముందుకొచ్చిన వాదనల విషయంలో ఈ ధోరణి మరీ కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. మన దేశ రైతులు ఆహార ధాన్యాల సాగు నుంచి ఇతర పంటల వైపు మళ్ళడం చాలా మంచిదని మన దేశంలో పలు పత్రికలు పెద్ద పెద్ద వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. నిజానికి చాలా కాలం నుంచీ పశ్చిమ దేశాలు దీనినే తమ డిమాండ్‌గా ముందుకు తెస్తున్నాయి. ఆ విధంగా ఇతర పంటలకు మళ్ళితే దాని వలన మన దేశీయ అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాలను మనం పండించడం వీలు పడదు. దరిమిలా ఏర్పడే కొరతను పూడ్చేందుకు తమ వద్దనున్న మిగులు నిల్వలను మన దేశం దిగుమతి చేసుకోవచ్చునని ఆ దేశాలు సూచిస్తున్నాయి. అంటే మనం తిరిగి హరిత విప్లవం కన్నా ముందురోజుల నాటి పరిస్థితులకు తిరిగి చేరుకుంటాం. అంటే మన ఆహార అవసరాల కోసం విదేశాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితిలో పడతాం. పశ్చిమ దేశాల డిమాండ్ ఇదే. దానినే మన భారతీయ ''మేధావులు'' చిలక పలుకుల్లా వల్లిస్తున్నారు.
పంటలకు మనీస మద్దతు ధర విధానం ఉన్నందున దానికి ఆశపడి పంజాబ్, హర్యానా రైతులు ''ఆహార ధాన్యాల వల''లో చిక్కుకు పోయారని, ఆహార ధాన్యాల పంటలు అంతగా లాభాలను ఆర్జించకపోయినా, దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోతున్నా, ఆ పంటల నుండి అంతకన్నా ఎక్కువగా లాభాలను తెచ్చి పెట్టే పంటల వైపు మళ్ళలేకపోతున్నారని, కనీస మద్దతు ధర ఇచ్చే భరోసాయే ఇందుకు కారణమని ఈ మేధావులు వాదిస్తున్నారు. ఇంతకన్నా బాగా లాభాలు తెచ్చిపెట్టే పంటల వైపు పంజాబ్, హర్యానా రైతులు తమ దృష్టి మళ్ళించాలని వారంటున్నారు. ఇప్పుడు మోడీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వారిని అటువైపుగా మళ్ళించేందుకు తోడ్పడతాయని అంటున్నారు.
సంపన్న దేశాల డిమాండును, అదే సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న ఈ మేధావులు మన దేశ రైతాంగం తమకేది మేలు చేస్తుందో, ఏది హాని చేస్తుందో తెలుసుకోలేనంత అజ్ఞానులని, మోడీకి మాత్రమే రైతులకేది మేలో బాగా తెలుసునని అనుకుంటున్నట్టు వుంది. ఏదేమైనా, వారి ఉద్దేశాలను పక్కనబెట్టి వారి వాదనలను కాస్త పరిశీలిద్దాం.
మన భారతీయ ఆహార సంస్థ వద్ద పుష్కలంగా ఆహార ధాన్యాల నిల్వలున్న సంగతి, ఇటీవల కాలంలో ఈ విధంగా నిల్వలు పేరుకుపోవడం పరిపాటి అయిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిని బట్టి మన దేశంలో అవసరాలకు మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిపోతోందని నిర్ధారించడం అంటే అది తప్పుల్లోకెల్లా పెద్ద తప్పు అవుతుంది. ప్రపంచంలో ఆకలిగొన్న ప్రజలు ఎక్కువగా ఉండే దేశాల వివరాలను తెలియజేసే ప్రపంచ ఆకలి సూచికలో ఉన్న 111 దేశాలలో మన దేశం 100వ స్థానంలో వుందన్న వాస్తవాన్ని గుర్తు చేసుకుంటే మన దేశంలో పేరుకుపోయిన నిల్వలు అవసరాలకు మించిన నిల్వలు కావని బోధపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన ప్రతిసారీ ఆహార ధాన్యాల నిల్వలు తరిగిపోవడం, అదే కొనుగోలు శక్తి తగ్గిపోయిన ప్రతిసారీ ఆ నిల్వలు పేరుకుపోవడం జరుగుతోంది. అంతే కాని మన దేశంలో అవసరాలకు మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగినందువలన కాదు.
ఆహార ధాన్యాల నిల్వలు పేరుకోకుండా ఉండాలంటే అందుకు పరిష్కారం ప్రజల కొనుగోలుశక్తిని పెంచడమే. ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించడం, ప్రజలకు మరింత సొమ్ము అందేలా చూడడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. నిజానికి ఈ విధంగా చేయడం వలన ప్రభుత్వానికి అదనంగా ఖర్చయ్యేదేమీ వుండదు. ప్రభుత్వం బ్యాంకుల నుండి ఒక వంద రూపాయలు అప్పు తెచ్చి దానిని ప్రజలకు పంచిందనుకుందాం. అలా వచ్చిన సొమ్ముతో శ్రామిక ప్రజలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తారు. అలా ఆ సొమ్ము భారతీయ ఆహార సంస్థకు చేరుతుంది. దానిని తిరిగి బ్యాంకులకు చెల్లించివేస్తారు. అప్పిచ్చిన బ్యాంకులూ ప్రభుత్వానివే. తిరిగి చెల్లించే భారతీయ ఆహార సంస్థ కూడా ఆ ప్రభుత్వానిదే. అంటే ఈ చర్య వలన ప్రభుత్వపు నికర రుణం ఏమాత్రమూ పెరగదు.
ఒకసారి రైతుల నుండి పంట కొనుగోలు చేశాక దానిని నిల్వగా అట్టిపెట్టుకోవడం కన్నా ప్రజలకు అందేలా చేయడం వలన ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందీ కలగదు. పైగా ప్రజల ఆకలిని తీర్చడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, నిల్వ చేయడానికయ్యే ఖర్చు తగ్గడం వంటి బహుళ ప్రయోజనాలు కూడా వుంటాయి. ఒకవేళ ప్రజలకు అందిన సొమ్ము మొత్తంగా ఆహార ధాన్యాలకే ఖర్చు చేయకపోయినప్పటికీ అది ప్రయోజనకరమే. కొనుగోలు శక్తి తగ్గిపోయి కుంటుపడిన మన ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఏ రూపంలో ఖర్చు చేసినా అది ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికే దారి తీస్తుంది.
అలా చేసే బదులు ఆహార పంటలు పండించే భూములను ఇతర వినియోగాలకు మళ్ళిస్తే దానివలన ప్రజలు శాశ్వతంగా సామూహికంగా ఆకలి కడుపులతో కొనసాగవలసి వస్తుంది. భూ వినియోగం మారినందువలన తద్వారా కలిగే ఉపాధి...ఆహార ధాన్యాల ఉత్పత్తి ద్వారా ఆ భూముల మీద గతంలో కలిగిన ఉపాధి కన్నా ఎక్కువగా ఉంటేనే ఆ మార్పు ప్రజల కొనుగోలుశక్తిని పెంచుతుంది. భూ వినియోగ మార్పు వలన అదనపు ఉపాధి కలగకపోతే ఆ మార్పు ఏ విధంగానూ ప్రజల ఆకలిని తగ్గించదు. కాబట్టి భూవినియోగ మార్పు వలన గాక ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా మాత్రమే వారి ఆకలిని తీర్చడం సాధ్యపడుతుంది. రైతులు అగ్రో ప్రాసెసింగ్ పనులు చేపట్టాలని చెప్పడం మంచిదే. కాని అందుకోసం ఆహార ధాన్యాలను పండించే భూముల విస్తీర్ణం తగ్గించనవసరం లేదు.
ఒక ఎకరా భూమిలో ఆహార ధాన్యాలు పండించే బదులు ఇతర పంటలకు మళ్ళిస్తే అది ఎక్కువ లాభదాయకం అన్న పొరపాటు అవగాహన ఉంది. ఒక ఎకరంలో పండే పంటలో ఏది లాభదాయకం అన్నది సమాజానికి అప్రస్తుతం. ఒక ఎకరం భూమిలో ఆహారపంట పండించే బదులు ఇతర పంటలకు మళ్ళించడం వలన ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని అదనపు ఉపాధి ఏమైనా కల్పించబడిందా అన్నదే కీలకం. ఒక ఎకరం భూమిని ఆహార పంటల నుండి వ్యాపార పంటకు మళ్ళించడం వలన ఆ భూయజమానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయిందనుకుందాం. అదే సమయంలో ఆ మార్పు వలన అంతవరకూ కలిగిన ఉపాధి గనుక సగానికి పడిపోతే దానివలన గ్రామీణ ప్రాంతంలో పేదరికం పెరుగుతుంది. ఒకసారి పేదరికం పెరిగితే ఆ వ్యాపార పంటకు కార్పొరేట్ సంస్థలు చెల్లించే ధర కూడా తగ్గిపోతుంది. కాబట్టి పంట మార్పిడి వలన పెరిగే ఆదాయం ప్రధానం కాదు. దానివలన ఉపాధి అదనంగా పెరుగుతుందా లేదా అన్నదే ప్రధానం (ఆహార పంటల నుండి ఇతర పంటలకు మళ్ళించినందు వలన ఏర్పడే ఆహార ధాన్యాల కొరతను దిగుమతుల ద్వారా అదే ధరలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా పూడ్చుకోగలుగుతాం అని గ్యారంటీగా చెప్పగలరా? ప్రస్తుత సామ్రాజ్యవాద ఆధిపత్య ప్రపంచంలో అది సాధ్యం అనుకోడం కన్నా పొరపాటు ఇంకొకటి ఉండదు. అంతే కాదు. ఏ విషమ షరతులూ లేకుండానే సామ్రాజ్యవాదులు మన ఆహార ధాన్యాల దిగుమతుల అవసరాలను నెరవేరుస్తారనుకోవడం కూడా భ్రమే).
ఆహార ధాన్యాల నిల్వలు పేరుకుపోకుండా వుండడానికి పరిష్కారం ప్రజల చేతుల్లోకి అదనపు సొమ్మును చేర్చడం. అలాగే రైతుకు పంట లాభసాటిగా వుండేలా చేయడానికి పరిష్కారం కనీస మద్దతు ధరను పెంచడం, ధాన్య సేకరణ ధరను పెంచడం. అయితే ఇలా మద్దతు ధర పెరగడం వలన ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి కదా అని అడగవచ్చు. ఆహార ధాన్యాల ధరలు పెరగకుండా వుండాలంటే వాటిపై సబ్సిడీ ఇవ్వడం పరిష్కారం. ఆ విధంగా సబ్సిడీ ఇవ్వాలంటే అందుకు అదనపు ఆదాయ వనరులు ఎక్కడివి అన్న ప్రశ్న వస్తుంది. దేశంలోని ఆదాయాల అసమానతలు తీవ్రంగా ఉన్నాయి గనుక ఈ పరిస్థితిని సరి చేసే విధంగా తగు ఆర్థిక విధాన పరమైన చర్యలను తీసుకోవాలి. అంటే అధికాదాయ వర్గాలపై పన్నులు పెంచాలి, వారికిచ్చే సబ్సిడీలను తగ్గించాలి. అటువంటి చర్యలను చేపట్టడానికి వెనుకాడితే ఇప్పుడు రైతుల ఆదాయాలు పడిపోతున్నాయంటూ కార్చేవన్నీ మొసలి కన్నీళ్ళనుకోవాలి. రైతుల సమస్యల పట్ల నిజాయితీ లేకుండా కేవలం సామ్రాజ్యవాదుల ఎజెండాను అమలు చేయడానికి సిద్ధపడుతున్నారని భావించాలి.
వ్యాపార పంటల వైపు భూ వినియోగం మారితే తక్షణం రైతు ఆదాయం పెరుగుతున్నట్టు కనిపించినా, ప్రపంచ మార్కెట్‌లో ఈ వ్యాపార పంటల ధరలు కుప్పకూలితే ఆ రైతులు పూర్తిగా దివాలా తీయడం ఖాయం. వ్యాపార పంటల ధరలు ప్రపంచ మార్కెట్‌లో ఎంత తీవ్రంగా ఎగుడుదిగుళ్లకు లోనవుతూంటాయో మన ముందున్న అనుభవాలు చెప్తున్నాయి. దాని నుండి రక్షణ కల్పించాలన్నా రైతుకు కనీస మద్ద్దతు ధర గ్యారంటీ చేయాల్సిందే.
మోడీ కన్నా, భూ వినియోగాన్ని ఆహార పంటల వైపు నుండి మళ్ళించాలని వాదనలు తెస్తున్న ''మేధావుల'' కన్నా ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. కాని విచిత్రంగా ఆ రైతులకే ఏమీ తెలియదని ఈ ''మేధావులు'' చెప్తున్నారు !
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్