Oct 14,2023 22:01

ఎవరి తపన వారిదే

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: ఎన్నికలకు మరో ఆరేడు నెలలు ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి మంచి ప్రచారం దక్కేలా ప్రభుత్వం ఇటీవల అనేక కార్యక్రమాలను తీసుకుంది. అందులో ముఖ్యమైన కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి. కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి మంచి ప్రచారం పొందాలని భావించిన ప్రభుత్వానికి ఆశించినంతగా పేరు దక్కడం లేదు. వైద్య శిబిరానికి నిపుణులైన డాక్టర్లు వస్తారంటూ స్థానిక నాయకులు ప్రచారం చేస్తున్నా... జనం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. సచివాలయ సిబ్బంది, టవలంటీర్లు, నాయకులతోనే శిబిరం నిండిపోతోంది. కొన్నిచోట్ల మనుషులు రాకపోతే వారు వచ్చినట్లు వేలి ముద్రలు వేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం నుంచి ఆశించిన ఫలితం రాకపోగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సామూహిక గృహప్రవేశ ఉత్సవాలూ పేలవంగా జరిగాయి. పార్టీకి, కేడర్‌కు సమన్వయం కొంత లోపించినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒకలా ఆలోచిస్తే... వైసిపి కేడర్‌ మరోలా ఆలోచిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో పెండింగ్‌ ప్రాజెక్టులు, పథకాలను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తొందరపడుతుంటే... జిల్లా నాయకత్వం మాత్రం దీనిని పెద్దగా సీరియస్‌ తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామూహిక గృహప్రవేశాలే ఇందుకు ఉదాహరణ. కార్యక్రమాన్ని చాలా అట్టాహాసంగా చేసి రాజకీయంగా వచ్చే ప్రయోజానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని పార్టీ పరితపించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా జిల్లాకు సంబంధంచి జలుమూరు మండలం లింగాలవలసలో లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా సామర్లకోటలో వీటిని ప్రారంభిస్తే.. జిల్లాల్లో నిర్ణయించిన లేఅవుట్లలో జిల్లా మంత్రులు ప్రారంభించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. లింగాలవలస లేఅవుట్‌లో సామూహిక గృహప్రవేశాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వస్తారని అంతా భావించారు. జిల్లాలోనే ఉన్నా ఆయన రాకపోవడం ఒక రకమైన రాజకీయ చర్చకు దారి తీసింది. శ్రీకాకుళంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు సామూహిక గృహ ప్రవేశాలకు రాకుండా డుమ్మా కొట్టడం అనేక సందేహాలకు తావిచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్య కృష్ణదాస్‌ నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తుండటంతో అక్కడికి వెళ్లడానికి ఇష్టం లేకే హాజరు కాలేదా? అన్న చర్చ కేడర్‌లో సాగుతోంది. వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయా? అన్నట్లు ఇరువురూ వ్యవహరిస్తుండటం చర్చకు మరింత బలం చేకూరుతోంది. గతంలో పలుమార్లు జిల్లాస్థాయి పార్టీ సమావేశాల్లో పక్కపక్కనే కూర్చున్నా కనీసం పలకరించుకోకపోవడాన్ని ఉదాహరిస్తున్నారు. కారణాలేవైనా మంత్రి ధర్మాన గైర్హాజరు కాకపోవడం, ఇతర ప్రజాప్రతినిధులూ రాకపోవడంతో సామూహిక గృహ ప్రవేశాలు అత్యంత పేలవంగా సాగాయన్న విమర్శలు వచ్చాయి. నేతల మధ్య విభేదాలు, సమన్వయం లోపంతో జిల్లాలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం విఫలమైందనే చెప్పొచ్చు. దీంతో ప్రభుత్వం ఆశించినట్లుగా ప్రభుత్వానికి, పార్టీకి దక్కాల్సిన ఇమేజ్‌ రాకుండా పోయింది. వైసిపికి రావాల్సినంత మైలేజ్‌ రాకపోవడం వెనుక చంద్రబాబు అరెస్టు ప్రభావమూ కొంత ఉండొచ్చన చర్చ జిల్లాలో సాగుతోంది. చంద్రబాబు అరెస్టు నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తూ రోడ్డెక్కడంతో అవే ఫోకస్‌ అవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు వార్తలు, ఆరోగ్యం వంటి అంశాల చుట్టే జనాల చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు అరెస్టు శ్రేణులకు బాధ కలిగిస్తున్నా, గతనెల రోజులకు పైగా ఏదో ఒక నిరసన కార్యక్రమంతో యాక్టివ్‌ అవ్వడం తమకు మేలు చేసేదిగా పార్టీ నాయకులు భావిస్తున్నారు. అధినేత జిల్లా పర్యటనకు వచ్చినప్పుడో, లేక ఏదైనా అంశంపై పార్టీ పిలుపు నిచ్చిన సందర్భంలో మాత్రమే అక్కడక్కడ రోడ్డు మీదకు వచ్చే పార్టీ శ్రేణులు ఇప్పుడు నిరంతరం ఆందోళన కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇంటింటికీ వెళ్లి పోస్టర్లను పంచే కార్యక్రమాన్ని చేస్తున్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేసిందంటూ కరపత్రాల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. కరపత్రాల ద్వారా ఇలా జనం దగ్గరకు వెళ్లడం టిడిపికి బహుశా ఇదే మొదటి సారి కావొచు. గతంలో పలు సందర్భాల్లోనూ, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నా ప్రజా సమస్యలను కరపత్రాల రూపంలో ముద్రించి ఇంటింటికీ వెళ్లడం ఎప్పుడూ చేయలేదు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ, విశాఖకు రైల్వేజోన్‌, వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళానికి నిధులు ఇవ్వకుండా ఆపేసిన కేంద్రం అన్యాయంపై ఏనాడూ పోస్టర్లు పంపిణీ చేసిన సందర్భాలు లేవు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడుతున్న వివిధ తరగతుల ప్రజల సమస్యలను జనంలోకి తీసుకువెళ్లిందీ లేదు. అధినేత అరెస్టుపై స్పందించినట్లుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మాట్లాడితే ప్రజల నుంచి వారికి తప్పనిసరిగా మద్ధతు లభిస్తుందన్న విషయం గుర్తించాలి.