Jul 11,2023 21:52

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

    అనంతపురం ప్రతినిధి : 'మా అన్నను చేసినట్టు చేయాలని ఊహించినా... ఎవరి కోసం సంపాదిస్తున్నాడో అది లేకుండా పోతుంది' అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డిని ఉద్ధేశించి వార్నింగ్‌ ఇచ్చారు. గడిచిన నాలుగైదు రోజులుగా వరుసగా ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సోమవారం నాడు జెసి.ప్రభాకర్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుటుంబపైనా ఆరోపణులు చేశారు. దీనిపై మంగళారం నాడు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలబీమా ఏ రకంగా వస్తుందన్న విషయం కూడా జెసి.ప్రభాకర్‌రెడ్డికి తెలిసినట్టు లేదని అన్నారు. బీమాలో ఎంత వయసు చెట్లకు బీమా ఇవ్వాలన్న నిబంధనేదీ లేదన్నారు. దాన్ని పట్టుకుని ఏవేవో ఆరోపణలను జెసి.ప్రభాకర్‌రెడ్డి చేస్తున్నాడని విమర్శించారు. ఆయన మాటలను ప్రజలెవరూ వినే పరిస్థితి లేదని చెప్పారు. రాజకీయాల్లో తానుఎంతో గొప్ప అని చెప్పుకునే జెసి కుటుంబం ఆయనకంటే చిన్న వాడైన నారా లోకేశ్‌ కాళ్లు పట్టుకుని టిక్కెట్టు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. 2024లోనూ నీవు గెలవలేవని చెప్పారు. ఆ గెలుపు తరువాత నీవు పాడెనెక్కుతావో... నేను ఎక్కుతానో చూపిస్తానని హెచ్చరించారు. తెలంగాణలో దొంగతనాలు, దోపిడీలు చేస్తే తరిమేస్తే వచ్చినది మీ కుటుంబమని, అటువంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. లిక్కరు కేసులు తనపైనున్నవి ఆయన పెట్టించిన దొంగ కేసులేనని చెప్పారు. ఆయనపై కూడా రెండు కేసులున్నాయని గుర్తు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే ఆయన కుటుంబ చరిత్రను బయట పెడతానని హెచ్చరించారు. నేను జైళ్లోనున్న సమయంలో మా అన్నను హత్య చేసి మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసు నీరుగార్చారని చెప్పారు. దాన్ని చూసుకుని తిరిగి ఏదైనా చేయాలని ఊహించినా ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఆ రకంగా ఊహించినా 'నీవు ఎవరి కోసం సంపాదించాలని అనుకుంటున్నావో... అది లేకుండాపోతుంది' జాగ్రత్త అని పెద్దారెడ్డి హెచ్చరించడం చర్చనీయాంశమవుతోంది.