Oct 11,2023 21:55

జలుమూరు మండలం లింగాలవలస లేఅవుట్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన ఇళ్లు

* రాష్ట్రవ్యాప్తంగా నేడు సామూహిక గృహ ప్రవేశాలు
* జిల్లాలో 26,970 ఇళ్లు ప్రారంభం
* జలుమూరులో ప్రారంభించనున్న మంత్రి ధర్మాన
* ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఎట్టకేలకు సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ఐదో పర్యాయాల అనంతరం గృహ లబ్ధిదారులతో ప్రవేశాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 12వ తేదీన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకోసం గతంలో అనేకసార్లు తేదీలు ప్రకటించినా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు జలుమూరు మండలం లింగాలవలస లేఅవుట్‌లోని గృహాలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : 
జిల్లాలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. వీటిని పలు దశల్లో చేపడుతూ 2024 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. వీటిలో తొలుత ఈనెల ఐదో తేదీన 26,970 మందితో గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లు పూర్తయినట్లు లెక్కలు చెప్తున్నా, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన అంతమాత్రంగానే ఉంది. సొంత స్థలాల్లో నిర్మించుకుంటున్న ఇళ్లకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కొంతవరకు బాగానే కల్పించినా, జగనన్న లేఅవుట్లలో మాత్రం తీవ్ర వెనుకబాటు కనిపిస్తోంది. జిల్లాకు నిర్ధేశించిన 26,970 ఇళ్లకు గానూ ఇప్పటివరకు 24,773 ఇళ్లకు తాగునీరు అందించినట్లు అధికారులు చెప్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి 25,182 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. నీటి సరఫరాకు సంబంధించి మూడు మండలాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్న 26,970 ఇళ్లకు గానూ ఇంకా 1788 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా అందించలేదు.
అరకొరగానే మౌలిక వసతులు
శ్రీకాకుళం అర్బన్‌ ప్రాంతంలో 875 ఇళ్లను ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటివరకు 510 ఇళ్లకు మంచినీటి సౌకర్యం, 324 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. సోంపేటలో 945 ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తుండగా, వాటిలో 363 ఇళ్లకు తాగునీరు, 188 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇచ్ఛాపురం మండలంలో 632 ఇళ్లలో ప్రవేశాలు చేయించాలని నిర్ణయించగా 181 ఇళ్లకు తాగునీరు, 177 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. జలుమూరులో 1104 ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తుండగా వాటిలో 145 ఇళ్లకు తాగునీరు, 60 ఇళ్లకు విద్యుత్‌ సరఫరా సమకూర్చలేదు. ఇచ్ఛాపురం అర్బన్‌లో 962 ఇళ్లకు గానూ 125 ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు, 128 ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం అందించలేదు. పలాస-కాశీబుగ్గలో 795 ఇళ్లను ప్రవేశాలకు సిద్ధం చేస్తుండగా 209 గృహాలకు తాగునీరు, 24 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు సమకూర్చలేదు. ఆమదాలవలస అర్బన్‌లో పరిస్థితి కొంత బాగానే ఉంది. 761 ఇళ్లలో ప్రవేశాలు చేయాలని నిర్ణయించగా ఎనిమిది ఇళ్లకు మంచినీరు, పది ఇళ్లకు కరెంట్‌ సరఫరా చేయలేదు.
ఐదు పర్యాయాల అనంతరం...
సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఇప్పటివరకు ఐదు పర్యాయాలు వాయిదా పడ్డాయి. 2022లో విజయదశమి రోజున నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్‌ 21న చేపడతామని నిర్ణయించింది. గృహ నిర్మాణాల లక్ష్యం కనీసం సగం కూడా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 22న ఉగాది సందర్భంగా అందరితో గృహ ప్రవేశాలు చేయిస్తామని తెలిపింది. ఆగస్టు 30న ప్రారంభించేందుకు తేదీ ఇచ్చింది. ఈ నెల ఐదో తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఆ తేదీ వాయిదా పడింది.
సర్వాంగ సుందరంగా...
సామూహిక గృహ ప్రవేశాలను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లింగాలవలస లేఅవుట్‌లో ప్రారంభించనున్న 76 ఇళ్లతో పాటు లేఅవుట్‌తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. గృహాలకు విద్యుత్‌, మంచినీటి సౌకర్యం అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇళ్లకు నీలం రంగు, అంతర్గత రహదారులు, వాటికి ఇరువైపులా మొక్కలు, స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేశారు. ఇళ్లకు మామిడి తోరణాలు, అరటి బోదెలు కట్టారు. జలుమూరు మండలం లింగాలవలసలో గృహ ప్రవేశాల ప్రారంభోత్సవాల సందర్భంగా సభ ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గోనున్నారు.