Jul 23,2023 21:25

ప్రజాశక్తి - పెనుగొండ
           స్థానిక ఎస్‌వికెపి డాక్టర్‌ కెఎస్‌.రాజు ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల అటానమస్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సదస్సు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల పాలకవర్గం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైవివి.అప్పారావు మాట్లాడుతూ 1974లో కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ కళాశాల సాధించిన ప్రగతిని, నాక్‌ 'ఎ' గ్రేడు సిపిఎస్‌ హోదా, వివిధ రంగాల్లో విద్యార్థులు సాధించిన విజయాలు, ప్రగతి వివరించారు. కళాశాల అధ్యక్షులు పి.సూర్యనారాయణ మాట్లాడుతూ ఇటువంటి సదస్సులను నిర్వహించడం అవసరమని పూర్వవిద్యార్థులను అభినందించారు. అనంతరం కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ డాక్టర్‌ కె.రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో చదువుతో పాటు అనేక నైపుణ్యాలు కలిగి ఉంటేనే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. దానికి పూర్వ విద్యార్థుల సహకారం అవసరం చాలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్య్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు మచిలీపట్నం సిఐ వి.పెడ్డిరాజు మాట్లాడుతూ తానుకూడా ఈ కళాశాలలో చదువుకున్నానని చెప్పారు. మరొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను కూడా ఈ కళాశాలలో చదివానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరసాపురం బస్‌ డిపో మేనేజర్‌ సుబ్బారెడ్డి, రిటైర్డ్‌ టీచర్‌ కృష్ణారెడ్డి, అనేక రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ప్రసంగిస్తూ కళాశాల గొప్పతనాన్ని కొనియాడారు. కళాశాలకు తమవంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ కెవిఆర్‌.సూర్యనారాయణ కళాశాల అభివృద్ధిని విశదీకరించి అభినందించారు. ఈ సదస్సుకు కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, పురప్రముఖులు పాల్గొన్నారు.