Oct 25,2023 21:44

ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి

ఎస్‌సి, ఎస్‌టిపై కక్ష సాధింపు తగదు
ప్రజాశక్తి-కావలి : బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ ఎస్‌.సి, ఎస్‌.టి పిల్లలపై, జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత గిరిజన బిడ్డలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తగవని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జర్నలిస్టు క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2008 సంవత్సరం నుంచి ''బెస్ట్‌ అవైలబుల్‌ స్కూలు''ను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పించి, ఆ డబ్బులు సంవత్స రానికి రూ.50వేలు ప్రభుత్వమే చెల్లించేదని తెలిపారు. ఆ విధంగా 2019 వరకు కొనసాగిందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్‌.సి., ఎస్‌.టి. పథకాలను రద్దు చేసిన విధంగానే ఈ పథకాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు. అంతే కాకుండా పిల్లలు బకాయిలు ఉంటే ఆయా స్కూళ్ల యాజమాన్యం పిల్లల దగ్గరే వసూలు చేయించాడని తెలిపారు. జిల్లాలో 2వేల మంది దళిత గిరిజన 5వ తరగతి వరకు కార్పొరేట్‌ స్కూళ్లలో ఉన్నప్పటికీ ఈ పథకం రద్దు చేయడం వల్ల స్కూళ్లు నుండి పిల్లలను అర్ధాంతరంగా బయటకు పంపించి వేశారని తెలిపారు.
ఈ విషయంపై విజయానంద్‌ అనే తల్లిదండ్రులు కమిటీ ద్వారా హైకోర్టులో దావా వేసి గెలిచినారన్నారు. హైకోర్టులో కూడా జగన్మోహన్‌ రెడ్డి ఈ పథకం అమలు చేయకూడదని కోట్ల రూపాయలు లాయర్లు ఇచ్చి వాదనలు జరిపించారు. ఇక్కడ అమలు చేయకుండా సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారని తెలిపారు. బేల్దారి, కూలి పనులు, చెక్కబండి కూలీలు, బేల్దారి మేస్త్రీలు ఒక కమిటీగా ఏర్పడి సుప్రీం కోర్టులో కూడా దావా వేసి గెలిచారని తెలిపారు. సుప్రీంకోర్టులో కూడా లాయర్లకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి వాదించి కూడా ఓడిపోయారని తెలిపారు. అధికారులు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని జి.ఒ. నెంబర్‌ 61 తీసుకొచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఇంత దుర్మార్గంగా చిన్న బిడ్డలపై జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. ఈ పథకం చంద్రబాబునాయుడు పెట్టాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అమలు కాకూడదని రూ.20 కోట్లు లాయర్లకు ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ విధమైన పట్టుదల దళిత గిరిజన పిల్లలపై ప్రవర్తించడం దుర్మార్గమైన విషయమన్నారు. కాబట్టి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, ఎం.మోహన్‌రావు, అశోక్‌, చలంచర్ల లక్ష్మయ్య పాల్గొన్నారు.