Oct 09,2023 22:19

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి - శ్రీకాకుళం: స్పందన ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీస్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వరరావు, జె.తిప్పేస్వామితో కలిసి సోమవారం నిర్వహించిన ఎస్‌పి స్పందన కార్యక్రమానికి 54 వినతులు వచ్చాయి. ఇందులో కుటుంబ తగాదాలకు సంబంధించి 10, పౌర సంబంధమైనవి 15, మోసపూరితమైనవి 6, ఇతర ఫిర్యాదులు 23 వచ్చాయి. సమస్యలను ఎస్‌పి సావధానంగా విన్నారు. ప్రతి ఒక్కరినీ అర్జీల విషయాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ల పరిధిలోని అధికారులకు తక్షణమే ఫోన్‌ ద్వారా సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఫిర్యాదుదారులు 'స్పందన' ఫిర్యాదులను వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లోనూ అందజేయవచ్చని చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేసి నిర్దేశించిన గడువు లోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.