Jul 07,2023 09:52

అనంతపురం సబ్‌రిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్న ఎసిబి అధికారులు

         అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దాన విక్రయ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణమూర్తి అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఆయనతోపాటు రైటర్‌, సహాయకుడిని అరెస్టు చేశారు. వీరి ముగ్గురిని నేడు కర్నూలు అవినీతి నిరోధక శాఖ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఇన్‌ఛార్జీ డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు. డీఎస్పీ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం నగరంలోని కోమలి రెసిడెన్సీ అనే హోటల్‌కు సంబంధించి అన్నదమ్ముల మధ్యనున్న ఆస్తి దానవిక్రయంతో ముడిపడి ఉంది. 4.5 సెంట్ల స్థలాన్ని పూర్వంలో ముత్తుకురు రామ్మోహన్‌, రవీంద్రనాథ్‌లు కలిపికొన్నారు. రవీంద్రనాథ్‌ మృతి చెందడంతో ఇద్దరిపైనున్న ఆస్తిని రామ్మోహన్‌పై మార్చుకునేందుకు ప్రయత్నించారు. దీనికి బంధవులు అందరూ కలిపి సంతకాలు సైతం చేశారు. అయితే దీన్ని పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ నమోదు చేశారు. దీన్ని తీసేసి రెగ్యులర్‌ రిజిస్ట్రేషన్‌గా మార్చాలంటే రెండు లక్షలు లంచమివ్వాలని సబ్‌ రిజిస్ట్రార్‌ డిమాండ్‌ చేశారు. అయితే అంత ఇచ్చుకోలేననడంతో అలాగే పెండింగ్‌లో ఉంచారు. దీనిపై మరోమారు రామ్మోహన్‌ బుధవారం నాడు సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిసి అంత ఇచ్చుకోలేను, కొంత తగ్గించాలని కోరడంతో రూ.1.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అనంతరం రామ్మోహన్‌ సమాచారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందించారు. దీనిపైన వలపన్నిన అధికారులు గురువారం ఉదయం నుంచి సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద మకం వేశారు. డబ్బులివ్వడానికి రామ్మోహన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ను కలవగా, ఆ డబ్బులు రైటర్‌ అయిన చంద్రశేఖర్‌కు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆయన సూచనల ప్రకారం రైటర్‌కు డబ్బులిచ్చేందుకు వెళ్తే ఆయన తన సహాయకుడు కృష్ణమురిళీకి ఇవ్వమని చెప్పడంతో ఆయనకిచ్చారు. వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు. అనంతరం విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పట్టుబడిన ముగ్గురు నుంచి రూ.1.30 లక్షల నగదుతోపాటు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం వీరిని అవినీతి నిరోధక శాఖ కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్‌కు పంపనున్నట్టు డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు.