అనంతపురం కలెక్టరేట్ : దేశంలో, రాష్ట్రంలో వైద్య విద్య సీట్లను అమ్ముకుంటు చేస్తున్న వ్యాపారాలు నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ డిమాండ్ చేశారు. బుధవారం వైద్య విద్య సీట్లు అమ్ముతున్న ప్రక్రియను నియంత్రించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో గుంతకల్‌లో నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్య సీట్లు అమ్ముకోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు. విద్యా రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం వహిస్తోందన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్లీనరీ సమావేశాలకు విద్యార్థులు, యువత పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రజిత, సిద్ధార్థ, తరిమెల గిరి, రాచేపల్లి సూర్య ప్రకాష్, శివ, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.










