రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని కణేకల్ రోడ్డులో గల భారతీయ స్టేట్ బ్యాంక్ కార్యాలయంలో ఘరానా మోసం వెలుగు చూసింది. రూ.1.07 కోట్లు దుర్వినియోగం అయినట్లు ఆ బ్యాంకు ఉన్నతాధికారులు గర్తించారు. ఇదివరకు ఈ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసిన ఎస్‌ఎల్‌ఎన్.ఫణికుమార్ బ్యాంకు ఖాతాదారులకు చెందిన 1,07,30,023 రూపాయలు సొమ్మును తన తల్లి, ఇతరుల ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని గుర్తించిన స్టేట్ బ్యాంకు రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు దీనిపై విచారణ చేపట్టారు. సదరు బ్యాంకు మేనేజర్ ఫణికుమార్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గత జూన్ నెల 21న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటినుండి ఫణికుమార్ పరారీలో ఉన్నారు. బ్యాంకు ఉన్నత అధికారులు బ్యాంకులో విచారణ జరిపి దుర్వినియోగానికి గురైన ఖాతాదారుల సొమ్మును తిరిగి వారి ఖాతాలకు జమచేశారు. బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మేనేజర్ ఫణికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయనకోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ ఇన్స్‌పెక్టర్ లక్ష్మన్న తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకులో ప్రజల ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడంపై ప్రజలు, ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు వ్యవహారాలు చక్కదిద్దాల్సిన మేనేజరే నిధుల దుర్వినియోగానికి పాల్పడటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.










