అనంతపురం కలెక్టరేట్ : విద్యార్థుల ఫుడ్‌పాయిజన్‌కు గురై ఆసుపత్రుల పాలయ్యేందుకు కారణమైన బుక్కరాయముద్రం ఎస్‌ఆర్‌ఐటి కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటి కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 86 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారంపై ఎస్‌ఆర్‌ఐటి కళాశాల యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంభించిందన్నారు. శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర విద్యా శాఖ సలహాదారుగా ఉన్న ఆలూరు సాంబశివా రెడ్డి భాగస్వామ్యంతో నడిచే ఈ కళాశాలలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం విచాకరం అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కేవలం డబ్బే లక్ష్యంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు. లక్షలాది రూపాయల ఫీజులను రూపంలో తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఎస్‌ఆర్‌ఐటి కళాశాల యాజమాన్యం అధికారమదంతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి ఎస్‌ఆర్‌ఐటి కళాశాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.










