ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ రమాదేవి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హత్యకు గురైన నార్పల మండలం, బొందలవాడ గ్రామానికి చెందిన దళిత రమాదేవి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ పరామర్శించారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా దళిత నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన వసతులన్నీ ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, వ్యవసాయ పొలం, మూడు నెలలు నిత్యావసర సరుకులు ఇస్తారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అక్కడే ఉన్న ఆర్‌డిఒ మధుసూదన్‌కు పలు సూచనలు చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నే చిరంజీవి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు హనుమంతు, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ఆర్.నరసింహులు, రాయలసీమ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, అప్పా టీం జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, యువసేన జిల్లా అధ్యక్షులు శ్రీ రాఘవ, యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ టిసి.నాగేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర, జిల్లా నాయకులు బాల నాగేంద్ర, బండి మహేష్, లక్ష్మీనారాయణ, రాళ్లపల్లి చంద్రశేఖర్, సాకే నరసింహులు, పాలవాయి సుధాకర్, కన్నేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.










