ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డిఆర్‌ఒ
చిత్తూరులో మూడు కేంద్రాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఈనెల 15వ తేదీ ఆదివారం ఏపీపీఎస్సీ తరపున వివిధ శాఖలలో ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం కోసం జరుగు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం డిఆర్‌ఓ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో డిఆర్‌ఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల నిర్వహణ కోసం చిత్తూరులోని మూడు విద్యాసంస్థలు శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, శ్రీశ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల, వేము ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాసేందుకు 648 మంది విద్యార్థులకు పరీక్షాకేంద్రాలుగా కలవని, శ్రీశ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో 300 మంది, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో 245 మంది, వేము ఇంజనీరింగ్ కళాశాలలో 103మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా ఎనిమిది గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతి కలదని 9గంటల తరువాత అభ్యర్థులను అనుమతించరని తెలపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రంలో ఈ లోపల వెళ్లే సమయంలోనే ఎటువంటి వస్తువులు ఉన్న డిపాజిట్ చేసి వెళ్లాల్సి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి వస్తువులను అనుమతించమని డిఆర్‌ఓ స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు రావడం జరుగుతుంది కాబట్టి వారి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు తగిన బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని రవాణా అధికారులకు సూచించారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు గుర్తింపు కోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులను చూపాల్సి ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ నుంచి నాగభూషణం, రెవెన్యూ నుంచి సిసెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్, గుణశేఖర్ రెడ్డిలు ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటి తహశీల్దార్ లోకనాథం, లైజన్ ఆఫీసర్ హమీద్ బాషా, ఏపీ ట్రాన్స్కో, పోలీసు, ఆర్‌టిసి, వైద్యశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










