ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుమల అటవీ ప్రాంతంలో ఇటీవల ఏనుగులు సంచరించిన నేపథ్యంలో టీటీడీ అటవీశాఖ అధికారులు, మేస్త్రీలకు శ్వేతలో శనివారం ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత ఏనుగుల మనస్తత్వ శాస్త్రవేత్త డాక్టర్ రుద్ర ఆదిత్య ఈ శిక్షణ ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు థియరీ గురించి వివరించి కొన్ని వీడియోలు చూపించారు. సాయంత్రం శ్వేత ప్రాంగణంలోని పార్కులో క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏనుగులు జనావాసంలోకి వచ్చినప్పుడు గట్టిగా అరవడం, రాళ్ళతో కొట్టడం లాంటివి చేయకూడదన్నారు. పచ్చి వెదురు బొంగుకు గన్నీ బ్యాగ్, ఎండు మిరపకాయలు ఒక క్రమపద్ధతిలో చుట్టి మంటపెట్టి కొంతసేపటి తరువాత పొగవచ్చేలా చేసే ప్రక్రియ చేసి చూపించారు. ఇలాంటి వాటిని ప్రతి 10 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తే ఆ వాసనకు ఏనుగులు వెనక్కు వెళ్ళి పోతాయని చెప్పారు. వర్షాలు కురుస్తుంటే చెట్టుకు ఒక డబ్బా కట్టి అందులో పిడకలు, ఎండు మిరపకాయలు వేసి మంట పెట్టినా ఏనుగులు ఆ వాసనకు ముందుకు రాలేవని చూపించారు. తెలుపు, ఎరుపు రంగులు ఏనుగులకు ఆగ్రహం తెప్పిస్తాయని అందువల్లే అడవుల్లో పని చేసేవారు, సందర్శకులు ఈ రంగు వస్త్రాలు ధరించరాదన్నారు. అడవుల్లో ఉండే వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకోవడం శ్రేయస్కరమని డాక్టర్ రుద్ర ఆదిత్య తెలిపారు. ఏనుగు వెంటపడేటప్పుడు చెట్టు ఎక్కరాదని, ఒకే దశలో కాకుండా జిగ్‌జాగ్‌గా పరుగెత్తాలన్నారు. ఏనుగు ఎదురు పడినప్పుడు భయంతో కేకలు వేయకుండా తెలివిగా తప్పించుకునే మార్గం చూడాలని చెప్పారు. వీటితో పాటు ఏనుగులు ఏ సమయంలో, ఏ వాతావరణంలో, ఎలాంటి మనస్తత్వంతో ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఎఫ్‌ఓ, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, రేంజ్ ఆఫీసర్లు ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, రఘురామిరెడ్డి, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.










