ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు వచ్చింది ఏనుగు..
విద్యుదాఘాతంతో మృతి చెందుతున్న ఏనుగులు
గ్రామాలపై గజ దాడులు, తప్పని పంట నష్టం
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
ప్రజాశక్తి- పలమనేరు:
ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు వచ్చింది ఏనుగు.. అంటూ ఏనుగును చూడగానే పిల్లలు ఆనందంతో గంతులు వేస్తూ పాటలు పాడతారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా గ్రామాలపై దాడులు చేస్తున్న ఏనుగులను చూసి రైతులు, ప్రజలు మా ఊరికి రావద్దు ఏనుగు అంటూ ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో పదేళ్లుగా 20కి పైగా ఏనుగులు మతిచెందాయి. వాటి సంరక్షణ చూడాల్సిన అటవీ, వన్యప్రాణి అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. దాడులు చేసినపుడు తూ.. తూ మంత్రంగా చర్యలు చేపట్టి హడావిడి చేస్తున్నారు తప్ప అసలు ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దష్టి సారించడం లేదు. దీంతో ఏటా వేసవి కాలంలో ఏనుగులు గ్రామాలపై పడి ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగించడం పరిపాటైంది.
కౌండిన్య అభయారణ్యంలో సంరక్షణ చర్యలేవీ..?
చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన కుప్పం, పలమనేరు, చిత్తూరు పరిసర ప్రాంత అడవులను కౌండిన్య అభయారణ్యంగా ప్రకటించారు. ఈ ప్రాంతాలు తమిళనాడు అటవీ సరిహద్దు గ్రామాల్లో ఉండటంతో అక్కడ ఏనుగులు తరచూ సంచరిస్తుంటాయి. ఈ అటవీ భూభాగం నుంచి ఏనుగులు బయటకు రాకుండా ఉండేందుకు గత ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశాయి. అడవుల్లో వన్యప్రాణులకు నీరు, మేత సదుపాయంతో పాటు నీటి గుంటలు ఏర్పాటు చేయడం, చెక్ డ్యామ్ లను నిర్మించడం చేశారు. ఇవి కాకుండా అటవీ సరిహద్దు గ్రామాల వెంట ఒక మీటరు లోతు రెండు మీటర్ల వెడల్పుతో కందకాలను ఏర్పాటు చేశారు. అయితే ఈపనులపై పర్యవేక్షణ లోపం ఏర్పడటంతో అటవీశాఖ సిబ్బంది కాంట్రాక్టర్లు తూ..తూ.. మంత్రంగా పనులు చేపట్టడంతో అవి కొద్ది కాలానికే మట్టితో పూడుకు పోయాయి. దీంతో ఏనుగులు సునాయాశంగా ఈ కందకాలను దాటి గ్రామాల వైపు వస్తున్నాయి.
అసంపూర్తిగా సోలార్ ఫెన్సింగ్...
ఈ కందకాల వెంట అటవీ సరిహద్దు గ్రామాల వెంట సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఏవైనా జంతువులు ఈ ఫెన్సింగ్ను తాకితే షాక్ కొట్టే విధంగా ఉంటాయి. కాలక్రమేణా ఈ పనులను అసంపూర్తిగా వదిలివేయడం, వీటి పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరిపోయి లక్ష్యం కాస్త నీరుగారిపోయింది. అటవీ సరిహద్దులను ఏనుగులు దాటేటప్పుడే అటవీశాఖ సిబ్బంది పసిగట్టి వాటిని అడవుల్లోకి తరిమి వేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు. తొలుత వాటి రాకను గుర్తించడంలో వైఫల్యం చెందడంతో అవి గ్రామాల్లోకి వచ్చిన తర్వాత వాటిని బెదరగొట్టే చర్యలు చేపట్టడంతో అవి కాస్త బెదిరిపోయి పంటలను ధ్వంసం చేయడంతో పాటు పంటల సంరక్షణకు అక్కడక్కడా రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెల షాక్ కు గురై మతి చెందుతూనే ఉన్నాయి. అంతేకాకుండా పలుచోట్ల పంటలకు కాపలాగా ఉంటూ రైతులు సైతం ఏనుగుల దాడిలో మృతి చెందుతున్నారు. ఏనుగుల సంరక్షణ, అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏనుగుల పరిసరాల్లోని గ్రామాల్లోకి వచ్చి పంటలను, తోటలను నాశనం చేయడం, కరెంట్ షాకు గురై మరణించడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఇకనైనా అడవులను నుంచి ఏనుగుల రాకను ముందుగానే పసిగట్టి గ్రామాల్లోకి రాకుండా నివారించి రైతులను ఆదుకోవాలి, అలాగే వాటి సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి.










