- నరసింహ యాదవ్
ప్రజాశక్తి - తిరుపతి మంగళం: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో తిరుమల తిరుపతి ఎంతో అభివద్ధి చెందిందని, నేడు వైసిపి అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా టిటిడి బోర్డు ఛైర్మన్, సభ్యులు వ్యవహరిస్తున్నారని టిడిపి తిరుపతి పార్లమెంట్ ఇన్చార్జ్ నరసింహ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పోకడలతో సామాన్య భక్తులకు వెంకటేశ్వర స్వామిని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి సేవా టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేసి వారి బోర్డులోని సభ్యులకు వాటాలుగా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలోని హోటళ్లను మూసివేస్తామని ప్రకటించారని, వందల మందికి హోటళ్ల ద్వారా జీవనాధారం జరుగుతుంటే ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. అందరికీ సమాన భోజనం నిర్ణయం తీసుకుంటే దేవుడి ముందు అందరూ సమానమేనని, శ్రీవారి దర్శనం కూడా అందరికీ సమానం చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ఇంటి పట్టాలు పొందినవారు వెంటనే ఇల్లు కట్టుకోవాలని, లేకుంటే వారి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరికలు చేయడం దారుణం అన్నారు. కరోనా మహమ్మారి పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సూరా సుధాకర్ రెడ్డి, రవి నాయుడు, మనోహర్ ఆచారి, ఊట్ల సురేందర్నాయుడు, మధు పాల్గొన్నారు.










