Sep 15,2023 23:13

సదస్సులో మాట్లాడుతున్న రాధాకృష్ణ

* ప్రముఖ న్యాయవాది తర్లాడ రాధాకృష్ణ
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏకరూప పౌరస్మృతి (యుసిసి) వీలు పడదని ప్రముఖ న్యాయవాది తర్లాడ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఐకమత్యం ప్రధాన సమస్యగా దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి తరుణంలో యుసిసి వంటి తొందరపాటు చర్యలు పరిస్థితులను జటిలం చేస్తాయని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యుసిసిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్న భావన వ్యక్తం చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం, యుటిఎఫ్‌ సంయుక్తంగా నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో యూనిఫారం సివిల్‌ కోడ్‌ అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న యుసిసి సాధనకు విస్తృత సంప్రదింపులు చేసిన తర్వాత అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల వారిని ఒప్పించడం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. బలవంతంగా రుద్దడం సాధ్యం కాదన్నారు.
డాక్టర్‌ అదీబ్‌ హసన్‌ మాటాడుతూ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సంకుచిత దృక్పథంతో చేసే ఏ చట్టం ప్రజామోదం పొందదన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ఇలాంటి సున్నిత అంశాల్లో అనివార్యమన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ కె.శ్రీనివాసు మాట్లాడుతూ యుసిసిపై దేశంలో జరుగుతున్న చర్చ ద్వారా మతపరమైన పోలరైజేషన్‌తో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారని చెప్పారు. ఇందులో ప్రజల ప్రయోజనాలు ఏవీ లేవని తెలిపారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు అధ్యక్షోపన్యాసం చేశారు. జిల్లా ప్రదాన కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌ వక్తలను ఆహ్వానించారు. గణపతి వందన సమర్పణ చేశారు. సదస్సులో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, మహిళలు, ముస్లిం పెద్దలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, పలు ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.