అనంతపురం ప్రతినిధి : ఇంటిఇంటి ఓటరు సర్వే విషయంలో అలసత్వం వహించిన ఇద్దరు బూత్‌లెవల్ అధికారులపై అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి కొరడా ఝళిపించారు. ఇద్దరు బూత్ లెవల్ అధికారులను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో పశు సంవర్ధకశాఖలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఇదిలాగుండగా ఓటరు జాబితా సవరణను చేపట్టేందుకు జులై 21వ తేది నుంచి ఆగస్టు 21వ తేది వరకు నెల రోజుల వ్యవధిలో ఇంటింటికెళ్లి ఓటరు జాబితాపై సర్వే చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర మంతటా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం అనంతపురం జిల్లాలోనూ ప్రారంభమైనప్పటికీ చాలా నెమ్మదిగా సర్వే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటరు సర్వేపై ఈనెల ఎనిమిదవ తేదీన జిల్లా కలెక్టర్ గౌతమి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంకా కొంత మంది అధికారులు ఓటరు సర్వేపై కదలికలేదని గుర్తించారు. ఎక్కడెక్కడ ఇంతవరకు కదల్లేదో వివరాలు అందజేయాలని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశించారు. వారిచ్చిన నివేదిక ప్రకారం చూస్తే వజ్రకరూరు మండలంలోని పోలింగ్ స్టేషన్ 63 కమలపాడులో ఇంత వరకు ఇంటింటి సర్వే మొదలు కాలేదు. అదే మండలంలోని పోలింగ్ స్టేషన్ 80 గడేహోతూరులోనూ సర్వే మొదలు కాలేదు. దీంతో సర్వే చేపట్టని కమలపాడు బూత్ లెవల్ అధికారి శ్రీనాథ్, జక్కల వెంకటేశ్‌పై చర్యలకు కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగానున్న ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
తొమ్మిది రోజుల్లో 54శాతం పూర్తయ్యేనా..!
జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు నెల రోజుల వ్యవధిలో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 46 శాతమే పూర్తయ్యాయి. 19.39 లక్షల మంది ఓటర్లు ఉంటే 8.92 లక్షల మంది ఓటర్ల పరిశీలన పూర్తయింది. అంట 46 శాతం పరిశీలన పూర్తయ్యింది. ఇంకా 56 శాతం జరగాల్సి ఉంది. ఇప్పటికి 22 రోజులు పూర్తయ్యాయి. ఇక మిగిలింది కేవలం తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో ఇంటింటి సర్వే పూర్తవడం సాధ్యమా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవైపు సిబ్బంది అలసత్వమవుతే.. మరోవైపు సాంకేతిక సమస్యలూ ఉన్నాయి. సర్వయర్ సమస్యల వల్ల అనుకున్నంత వేగంగా సర్వే ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం సిబ్బంది నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాపై దృష్టి సారించాయి. తప్పిదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.
బూత్‌లెవల్ అధికారి శ్రీనాథ్ ఆత్మహత్యాయత్నం
ఓటర్ల సర్వే పనిలో అలసత్వం వహించినందుకు కలెక్టర్ అతడిపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీనికి మనస్తాపం చెందిన శ్రీనాథ్ శనివారం నాడు ఆయన నివాసముంటున్న వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి వారు శ్రీనాథ్‌ను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం నగరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనాథ్‌ది చెన్నేకొత్తపల్లి స్వగ్రామం. విదుల్లో భాగంగా వజ్రకకరూరు మండలంలోని గూళ్యపాలెంలో ఉంటున్నారు. మూడు రైతు భరోసా కేంద్రాలకు ఇన్‌ఛార్జీగానున్న శ్రీనాథ్ పని ఒత్తిడితో ఓటరు జాబితా సర్వేలో పాల్గొనలేదని సమీప బంధువులు చెబుతున్నారు. ఈ విషయం చెబుతున్నా అధికారులు తనపై చర్యలు తీసుకున్నారన్న మనస్థాపనంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఆయన తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు.










