మాట్లాడుతున్న కలెక్టర్
ఎన్నికల ప్రక్రియలో
బూత్ లెవల్ అధికారులే కీలకం
ప్రజాశక్తి-నెల్లూరు:ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవల్ అధికారుల ది కీలక పాత్రయని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ ఎం హరినారాయణన్ పేర్కొన్నారు.శనివారం నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో నగరం, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన బి ఎల్ వో లు, సూపర్వైజర్లు, ఏ ఈ ఆర్ ఓ, ఇఆర్వోలకు నిర్వహించిన స్పెషల్ సమ్మరి రివిజన్ -2024 వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నూతనంగా నియమించబడినందున, వారికి ఎన్నికల ప్రక్రియ లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులుగా ఎన్నికల క్రతువులో పాల్గొనడం గౌరవంగా భావించాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ప్రతి ఉద్యోగి భారత ఎన్నికల సంఘం కనుసన్నల్లో ఉంటారనే విషయం గమనించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరిగే చిన్న తప్పులు కూడా పెద్ద సంక్లిష్టత కు దారి తీస్తాయని, అందుకే ఎటువంటి తప్పులకు అవకాశం, ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తగా ఎవరి భాధ్యతలు వారు సంపుర్ణంగా నిర్వర్తించాలన్నారు. స్వచ్చంగా తయారైన ఓటరు జాబితా బి ఎల్ ఓ ల పనితీరుకు అద్దం పడుతుందన్నారు . ఇప్పటివరకు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, నిర్దేశిత ప్రొఫార్మాల్లో పొందుపరిస్తే తదుపరి పని సులభతరమవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఎన్నికల సంఘం నిబంధనల్లో పరిష్కారముందని, కావున ప్రతి ఉద్యోగి బి ఎల్ ఓ హేండ్ బుక్ ను విధిగా చదవాలన్నారు. విధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్ర క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు.ఈ వర్క్ షాప్ లో నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, డిఆర్‌ఓ వెంకటనారాయణమ్మ, ఆర్డిఓ మలోల తదితరులు పాల్గొన్నారు.










