
* పరిశ్రమ గాలి, ధూళితో జనం జబ్బులపాలు
* పొందూరులో రక్షిత నీటి కోసం రూ.50 కోట్లు కేటాయింపు
* ఆమదాలవలసకు ఇండోర్ స్టేడియం మంజూరు
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: నాగార్జున అగ్రికమ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) పరిశ్రమ కాలుష్యంతో పొందూరు ప్రాంతంలో విపరీతమైన కాలుష్యం నెలకొందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వస్తున్న ధూళి, వాయువులతో భూగర్భజలాలు, గాలి కలుషితమవుతున్నాయని చెప్పారు. కాలుష్యంపై చాలాసార్లు యాజమాన్యాన్ని హెచ్చరించినా, తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినా పట్టించుకోకపోవడంతో, జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలుషిత పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వివరించామని చెప్పారు. పొందూరు, ఎరుకులపేట, తండ్యాం, రాపాక, కృష్ణాపురం, రెడ్డిపేట, లోలుగు, భగవాన్‌దాస్‌పేట, బురిడి కంచరాం, కేశవదాసుపురం, నందివాడ తదితర గ్రామాల ప్రజానీకానికి, స్వచ్ఛమైన శుద్ధ జలాన్ని తాగునీరుగా అందించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. శుద్ధి చేసిన జలాన్ని రాపాక కొండపై నిర్మించే ట్యాంకులకు పంపింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రెండో దశలో మజ్జిలిపేట, కోటిపల్లి, పెనుబర్తి, దల్లవలస పరిసర గ్రామాలకు ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆమదాలవలసకు ఇండోర్ స్టేడియం
ఆమదాలవలస పట్టణానికి ఇండోర్ స్టేడియం మంజూరు చేస్తూ ప్రభుత్వం జిఒ నంబరు 198 విడుదల చేసిందన్నారు. స్టేడియం నిర్మాణానికి రూ.7.15 కోట్ల ఆర్థిక అనుమతులనూ జారీ చేసిందని తెలిపారు. త్వరలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పనుల ప్రారంభోత్సవం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.ఏడు కోట్లు మంజూరు చేస్తూ జిఒ ఆర్‌టి నంబరు 198 విడుదలైందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ఆమదాలవలస క్రీడల హబ్‌గా రూపొందడం ఖాయమన్నారు. వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటజన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌తో పాటు మరిన్ని క్రీడలకు ఇండోర్ స్టేడియం వేదికగా నిలవనుందన్నారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడల ద్వారా మునుపటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఇండోర్ స్టేడియం ఉపకరిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో సాగునీరు అందని ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించేందుకు చొరవ చూపినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 13 గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణాలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వీటిలో ఆరు పథకాలు త్వరలో మంజూరు కానున్నాయన్నారు. వీటికి సంబంధించిన పరిపాలనా అనుమతులు పూర్తయినట్లు తెలిపారు.
చంద్రబాబు అరెస్టుపై జనాల్లో స్పందన లేదు
చంద్రబాబు అరెస్టుపై టిడిపి ఆందోళనలు చేస్తున్నా, జనంలో స్పందన లేదని చెప్పారు. ఆర్థిక నేరగాళ్లకు ప్రజల మద్దతు ఉండదన్నారు. ఇక టిడిపి పని అయిపోందన్నారు. జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టినా ఏమీ నిరూపించలేకపోయారని తెలిపారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై స్పందిస్తూ అధిష్టానం ఏం నిర్ణయిస్తే, దాన్ని అనుసరిస్తానని చెప్పారు.